2027 ODI World Cup : 2027 వన్డే ప్రపంచ కప్‌నకు (ICC ODI World Cup 2027) సరిగ్గా ఏడాది సమయం ఉన్న తరుణంలో కేప్ టౌన్‌లో టోర్నమెంట్ షెడ్యూల్ వెలువడిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌లో అక్టోబర్ 7వ తేదీన కేప్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తన పోరును ఆరంభించనుంది. ఆ తర్వాత అక్టోబర్ 10న జోహెన్నెస్‌బర్గ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ హీరోలు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా భారత జట్టు ప్రణాళికలు, పాకిస్థాన్‌తో పోరుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఎక్కువగా ప్రయోగాలు చేయకండి: యువరాజ్ సింగ్
2027 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకునే సత్తా భారత జట్టుకు పూర్తిగా ఉందని లెజెండరీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, జట్టులో అనవసరమైన మార్పులు, ప్రయోగాలు చేయడం మానుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు సూచించారు. టోర్నమెంట్‌కు కనీసం ఏడాది ముందు నుంచే 16 నుంచి 20 మందితో కూడిన కోర్ గ్రూప్‌ను సిద్ధం చేసుకోవాలని తెలిపాడు. నా అభిప్రాయం ప్రకారం జట్టులో ప్రతి పొజిషన్‌కు అనుభవం చాలా ముఖ్యం. టాప్ ఆర్డర్ కావచ్చు, మిడిలార్డర్ కావచ్చు.. నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఆడే ఆటగాళ్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలి.. కేవలం వరల్డ్ కప్ గెలవాలనే ఆలోచనతో ముందుకెళ్తే అది ప్లేయర్స్ పై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుంది. ప్రశాంతంగా ముందుకు కొనసాగుతూ, ముందుగానే సౌతాఫ్రికా పరిస్థితులకు అలవాటు పడేందుకు టోర్నమెంట్‌కు నెల రోజుల ముందే అక్కడకు వెళ్లాలని యువీ వెల్లడించాడు.
పాక్‌తో పోలిస్తే భారతే ఎంతో బలమైన జట్టు: సురేశ్ రైనా
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడుతూ.. ప్రస్తుత భారత జట్టు ఆడుతున్న తీరు, దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న శైలి ప్రత్యర్థుల కంటే చాలా ముందుంచాయని ప్రశంసించారు. భారత్ - పాక్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఎప్పుడూ భారీ అంచనాలుంటాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మన జట్టు ఎంతో ఉన్నతంగా ఉంది. సౌతాఫ్రికాలో పాక్‌కు మద్దతు లభించినా, మన ఆటగాళ్ల నాణ్యత, పేస్, బౌన్స్ రాబట్టే బౌలర్లు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. 1983, 2011 తరహాలోనే 2027లో మూడో ప్రపంచ కప్ టైటిల్‌ను దేశానికి తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది అన్నాడు. 140 కోట్ల మంది భారతీయల దీవెనలతో ఈసారీ పాకిస్థాన్‌పై మనం సులభంగా విజయం సాధిస్తామని రైనా పేర్కొన్నాడు.
