ఉద్యోగ విరమణకు ముందు ఆ కుటుంబం ప్రశాంతంగా గడవాల్సిన సమయంలో ఒక చిన్న మనస్పర్థ, ఆశ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నామినీ విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఏకంగా భర్త ప్రాణాలనే బలి తీసుకుంది.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ACTO గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య ఏఎన్‌ఎంగా, రెండో భార్య గృహిణిగా జీవిస్తున్నారు. అయితే వెంకటేశ్వర్లుకి ఈ నెల 30వ తారీఖున ఉద్యోగ విరమణ (రిటైర్మెంట్) కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వచ్చే బెనిఫిట్స్ , పత్రాల్లో నామినీగా రెండో భార్య పేరు పెట్టారనే కోపంతో మొదటి భార్య రగిలిపోయింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగింది. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో మొదటి భార్య విచక్షణ కోల్పోయి... ఇంట్లోని రోకలిబండతో వెంకటేశ్వర్లు వెనుక భాగంలో బలంగా కొట్టింది. ఈ దాడిలో వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలపాలై కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు.
