ఒకనాడు తన నిర్ణయంతో వందలాది మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న సీఈఓకు ఇప్పుడు అదే రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పట్లో క్షణం ఆలోచించకుండా.. జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను పీకేసిన విశాల్ గార్గ్‌కు ఇప్పుడు అదే కంపెనీ నుంచి ఊహించని షాక్ తగిలింది. డిజిటల్ మార్ట్‌గేజ్ లెండర్ 'బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్' సీఈఓ పదవి నుంచి ఆయనను కంపెనీ తొలగించింది. అంతేకాకుండా కంపెనీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి కూడా ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన చేసిన నిర్వాకమే ఇప్పుడు ఆయన పదవిని ఊడగొట్టిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో.
జూమ్ కాల్‌లో ఉద్యోగుల తొలగింపు..
విశాల్ గార్గ్ పేరు చెబితేనే 2021 నాటి ఆ చీకటి రోజు గుర్తుకొస్తుంది చాలా మంది ఉద్యోగులకు. ఆ ఏడాది డిసెంబర్‌లో బెటర్ కంపెనీ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 15 శాతం అంటే 900 మందికి పైగా ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించింది. కంపెనీ నిర్వహించిన ఒక జూమ్ వెబ్‌నార్‌లో కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటించారు. మార్కెట్ పరిస్థితులు, ఉత్పాదకత అంటూ చెప్పిన కారణాల కంటే కూడా.. ఆ ప్రకటన చేసిన తీరే తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ కాల్‌లో ఒక ఉద్యోగి ఏడుస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విశాల్ గార్గ్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ కంపెనీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది.
విశాల్ గార్గ్ మేనేజ్‌మెంట్ పై ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. లేఆఫ్ అయిన ఉద్యోగులు రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే పని చేస్తూ కంపెనీని దోచుకుంటున్నారని గార్గ్ ఆరోపించారు. అంతకుముందు కూడా ఉద్యోగులను ఉద్దేశించి చాలా కఠినమైన పదజాలం వాడటం, వారిని 'డబ్ డాల్ఫిన్స్' అని పిలవడం వంటి విషయాలు మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలన్నీ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎగ్జిక్యూటివ్‌లు వరుసగా తప్పుకోవడంతో.. విశాల్ గార్గ్ కొంతకాలం బలవంతపు సెలవుపై వెళ్లాల్సి వచ్చింది.
నమ్మిన బంటు చేతిలోనే మోసం?
తాజాగా విశాల్ గార్గ్‌ను పదవి నుంచి తొలగించడం వెనకాల పెద్ద తంతే నడిచింది. హెడ్జ్ ఫండ్ మేనేజర్ అయిన డేనియల్ లూయిస్ తనకు సలహాలు ఇస్తూ.. బోర్డులో మద్దతుగా నిలిచాడని గార్గ్ భావించారు. అయితేఅదే లూయిస్ వ్యూహాత్మకంగా బోర్డు సభ్యులను తనవైపునకు తిప్పుకుని ఆగస్ట్ 3న విశాల్ గార్గ్‌ను సీఈఓ పదవి నుంచి దింపేశారు. ప్రస్తుతం దీనిపై విశాల్ గార్గ్ లాయర్ అలెక్స్ స్పిరో ద్వారా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. కంపెనీ మళ్లీ లాభాల్లోకి వచ్చే వరకు కేవలం ఒక్క డాలర్ వేతనానికే పనిచేస్తానని.. తనను తిరిగి సీఈఓగా నియమించాలని బోర్డును కోరుతున్నారు. తోటి ఉద్యోగుల పొట్టకొట్టి, వారి కన్నీళ్లకు కారణమైన విశాల్ గార్గ్ కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడంపై సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ నడుస్తోంది.
