- పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అధ్యక్షతన సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఉద్యమం చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు సమావేశమయ్యారు. రీయింబర్స్‌మెంట్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందు ఒకలాగా.. ఇంప్లిమెంట్ విషయంలో మరోలా ప్రవర్తిస్తున్నాడని నేతలు తెలిపారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సంతకాల సేకరణ చేసి, ఆ పత్రాలను గవర్నర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే రాంచందర్ రావు రెండు రోజుల (48 గంటల) పాటు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులతో సమన్వయం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్, మహాధర్నా నిర్వహించనున్నట్టు రాంచందర్ రావు తెలిపారు.దీంతో పాటు రాబోయే శాసనమండలి ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధమవుతూ ప్రత్యేక కమిటీలను నియమించి ముందుకు వెళ్లాలని సమావేశంలో తీర్మానించినట్లు స్పష్టం చేశారు.
