- కరీంనగర్‌లో అత్యధికంగా 704 అర్జీలు
- హాజరైన 10,753 మంది అధికారులు
- రాష్ట్రవ్యాప్తంగా మండల ప్రజావాణికి విశేష స్పందన
హైదరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన మండల ప్రజావాణికి విశేష స్పందన లభించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 565 మండల పరిషత్ కార్యాలయాలు, సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం కలిపి మొత్తం 566 కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించారు. మొత్తం 5,410 వినతులు అందాయి. ఈ కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన 10,753 మంది అధికారులు హాజరయ్యారు. మండల కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు, శాఖల వారీగా ప్రత్యేక కౌంటర్లు, తాగునీటి వసతులు కల్పించారు.
ప్రజలు నేరుగా అధికారులను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అధికారులు అర్జీలు తీసుకుని రసీదులు ఇచ్చారు. వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించారు. ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లోనే అర్జీలు స్వీకరించారు. మండల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు, శాఖల వారీగా కౌంటర్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు.
టాప్‌లో కరీంనగర్ జిల్లా..
జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్‌లో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. ఒక మండలానికి సగటున 47 అర్జీలతో కరీంనగర్ ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక జిల్లాకు సగటున 164 వినతులు వచ్చాయి. మండల స్థాయిలో వచ్చిన అర్జీలను శాఖల వారీగా విభజించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలోనే ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రజావాణి ఉద్దేశమని రాష్ట్ర ఇన్‌చార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కె. విద్యాసాగర్ తెలిపారు.
