- దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో చట్టంలోని సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలోని ఆస్తుల వివరాలను ఎందుకు పెట్టరంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓమహిళ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదన్నది ప్రభుత్వ నిర్ణయమే అయినప్పటికీ, ఆ సమాచారాన్ని బహిరంగపరచాల్సిన అవసరం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ చట్టం-1908 సెక్షన్ 22-ఏ(1), 17(ఏ) నుంచి (డి) పరిధిలోకి వచ్చే ఆస్తుల వివరాలన్నింటినీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు సామాన్యులకు తెలియడం లేదని, దీనివల్ల అలాంటి భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉంచిన వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిషేధిత కేటగిరీ జాబితా సమీక్షలో ఉందని, త్వరలో ప్రచురిస్తామని మాత్రమే వెబ్‌సైట్‌లో కనిపిస్తోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. ఇరువైపుల వాదనలను విన్న న్యాయమూర్తి.. కొన్ని వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు, దానికి ‘నాలా’ మార్పిడి జరిగినా ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జాబితాను వెల్లడించకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.
