గద్వాల, వెలుగు: సర్‌లో భాగంగా జిల్లాలోని ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని, దానిపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16 లోగా ఫిర్యాదు చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ప్రజల పరిశీలనకు అన్ని పోలింగ్ స్టేషన్లు, ఎంపీడీవో, తహసిల్దార్, మున్సిపాలిటీ, ఆర్డీవో, కలెక్టరేట్లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16వరకు రాతపూర్వకంగా సమర్పించాలన్నారు.
వనపర్తి, వెలుగు: వనపర్తిలో జిల్లాకు సంబంధించి 2,37,006 మంది ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం కలెక్టరెట్‌లో అడిషనల్ కలెక్టర్ వినోద్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 15నాటికి జిల్లాలో 2,75,570 ఓటర్లు ఉండగా ప్రస్తుతం ముసాయిదా జాబితాలో 2,37,006 ఓటర్లు నమోదై ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత జాబితాలో 38,564 మంది ఓటర్లు తక్కువగా నమోదు అయ్యాయన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు రాని వారందరికీ ఈఆర్వో ద్వారా నోటీసులు జారీ చేస్తారని, నోటీసులు అందుకున్న వారు తగిన ఆధారాలతో రుజువు చేసుకుంటే తుది జాబితాలో పేరు నమోదు చేస్తారని పేర్కొన్నారు.
