- ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్‌తో విద్యాశాఖ మంత్రి జోషి సమీక్ష
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఎన్‌టీఏలో లీడర్‌షిప్ స్ట్రక్చర్‌లో మార్పులు, ఎక్స్పర్ట్స్ నియామకం, ఎగ్జామ్స్ సెక్యూరిటీ ప్రొసీజర్‌పై సమగ్ర సమీక్ష వంటి చర్యల ద్వారా సంస్థను ప్రక్షాళన చేయనున్నట్టు సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
యూజీసీ-నెట్ పరీక్షల్లో తలెత్తిన అవకతవకలపై ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్‌తో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూజీసీ-నెట్ పరీక్ష వివాదం తర్వాత ఎన్‌టీఏలో పూర్తిస్థాయి భద్రతా మార్పులు చేపట్టాలని మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్స్ ఆర్కిటెక్చర్‌లో పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలని సూచించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎక్స్ వేదికగా విద్యాశాఖ వెల్లడించింది.
50 మంది ఉద్యోగుల తొలగింపు..
ఎన్‌టీఏ వ్యవస్థను సంస్కరించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి మంత్రికి వివరించినట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ సంస్కరణల్లో భాగంగా 50 మందికి పైగా సిబ్బందిని ఏజెన్సీ నుంచి తొలగించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే, ఎన్‌టీఏలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, టెస్ట్ సెక్యూరిటీ జనరల్ మేనేజర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ సైకోమెట్రిక్స్ జనరల్ మేనేజర్ వంటి 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్‌షిప్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఏజెన్సీ సాంకేతిక, పరీక్ష నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఈ నిపుణులను తీసుకుంటున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అదనంగా, సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన వంటి ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను నియమించనున్నట్టు తెలిపింది. అలాగే, అన్ని పరీక్ష ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని, ఆడిట్ తర్వాత తీసుకున్న చర్యల వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఎన్‌టీఏను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
