- బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి
- వందేమాతరాన్ని సోనియా, రాహుల్ అవమానించారని ఫైర్
- బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారితే.. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బ్రదర్స్ పార్టీగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. బీసీల అండతో నడుస్తున్న బీజేపీనే అసలైన ప్రజల పార్టీ అని అన్నారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి రాంచందర్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం చేశాయన్నారు.
వందేమాతరం ఆలాపనకు 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరు బాధాకరమని రాంచందర్ రావు అన్నారు. వందేమాతరం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫైర్అయ్యారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అడవుల్లో నక్సలైట్లు లొంగిపోతుంటే.. నగరాల్లో మేధావుల ముసుగులో అర్బన్ నక్సల్స్ ఉన్నారని ఆరోపించారు.
బీజేపీలోకి సృష్టి వర్మ..
రాంచందర్ రావు సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై గతంలో వేధింపుల ఆరోపణలు చేసిన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు అల్వాల్, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు.
