44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా క్రీడల్లో భారత మహిళా హాకీ టీమ్‎కు గోల్డ్ మెడల్

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా క్రీడల్లో భారత మహిళా హాకీ టీమ్‎కు గోల్డ్ మెడల్

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సంచలనం సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1-0 తేడాతో చిత్తు చేసి భారత అమ్మాయిలు గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. దీంతో 44 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆసియా క్రీడల్లో భారత మహిళా హాకీ టీమ్ స్వర్ణ పతకం సాధించింది. చివరగా 1982 ఆసియా క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు గోల్డ్ మెడల్ గెల్చుకుంది. తాజా విజయంతో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత్‎ నేరుగా అర్హత సాధించింది. 

శుక్రవారం (అక్టోబర్ 2) జపాన్‌లోని గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‎లో భారత, చైనా మహిళా జట్లు చివరి వరకు హోరాహోరీగా తలపడ్డాయి. ఆట ఆరంభంలోనే లాల్‌రెమ్‌సియామి అద్భుతమైన గోల్ చేయడంతో భారత్ 1-0 అధిక్యంలోకి నిలిచింది. ఆ తర్వాత స్కోర్‎ను సమం చేసేందుకు చైనా ప్లేయర్లు భారత్ గోల్ పోస్ట్‎పై పదే పదే దాడి చేయగా భారత్ అమ్మాయిలు ధీటుగా డిఫెండ్ చేశారు.

ముఖ్యంగా భారత వెటరన్ గోల్‌కీపర్ సవితా పునియా ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను అద్భుతంగా సేవ్ చేసి చైనా ఈక్వలైజర్ ఆశలపై నీళ్లు చల్లారు. లాల్‌రెమ్‌సియామి చేసిన ఏకైక గోల్‎తో డిఫెండింగ్ చాంపియన్ చైనాను చిత్తు చేసి భారత అమ్మాయిలు స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలకు భారత మహిళా హాకీ టీమ్ నేరుగా అర్హత సాధించింది.