ఉగ్రవాద చర్యే.. స్మిత్ మచ్చర్ రియల్ హీరో.. ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై UAE సంచలన ప్రకటన

ఉగ్రవాద చర్యే.. స్మిత్ మచ్చర్ రియల్ హీరో.. ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై UAE సంచలన ప్రకటన

అబుదాబి: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై యూఏఈ సంచలన ప్రకటన చేసింది. ఈ ఘటనను యూఏఈ ఉగ్రవాద చర్యగా అధికారికంగా ప్రకటించింది. ప్రాణాలకు తెగించి పెను ప్రమాదాన్ని అడ్డుకున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‎ను‎ రియల్ హీరో అని కొనియాడింది. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ సలహాదారు అన్వర్ గర్గాష్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. 

‘‘దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‎పై కో-పైలట్ జరిపిన దాడి ఉగ్రవాద చర్య. అత్యంత క్లిష్ట పరిస్థితులలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన వృత్తి నైపుణ్యం, నైతిక స్పృహ, ధైర్యసాహసాలు అతడిని రియల్ హీరోగా నిలబెట్టాయి. జరిగిన ఘటనను తక్కువ చేసి చూడకూడకుండా, ఆధారాలు లేని పుకార్లు వ్యాప్తి చేయకుండా.. తీవ్రవాదం, ఉగ్రవాదం సృష్టించే సవాళ్లను ఎదుర్కోవడానికి సమాజంలో నిరంతర అప్రమత్తత, బాధ్యతాయుతమైన ప్రవర్తన అత్యంత అవసరం’’ అని అన్వర్ గర్గాష్ పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే..?

బుధవారం (సెప్టెంబర్ 30) ఆకాశంలో సినీ రేంజ్‎లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్‎కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్‎లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్‎పై కో పైలట్ కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.

ఆకాశంలో విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు పైలట్లు ధైర్యంగా కాక్ పిట్ డోర్ బద్దలుకొట్టి పైలట్‎పై దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్‎ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్ను ఆసుపత్రికి తరలించారు. కో పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించినట్లు సౌదీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లైదుబాయ్ ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.