- సర్పంచుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాలి
- సర్పంచులకు రూ.25 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి ఆలస్యం కావడానికి, పాలనాపరమైన ఇబ్బందులకు కారణం అవుతున్న 'ఉమ్మడి చెక్ పవర్' విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
గ్రామాల్లో ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం వల్ల సమాంతర పాలన ఏర్పడి, సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య ఆధిపత్య పోరు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సర్పంచులు బాధ్యతలు స్వీకరించి నెలలు గడుస్తున్నా.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక అధికారాలు, నిధులు అందడం లేదన్నారు.
స్థానిక సమస్యల పరిష్కారం కోసం సర్పంచులు తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళా సర్పంచులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారన్నారు.
ప్రభుత్వం తరచూ అమలు చేస్తున్న ఫండ్ ఫ్రీజింగ్ విధానం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పడకేసిందని మండిపడ్డారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని, ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇయ్యాల సర్పంచుల సమావేశం
సర్పంచుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు వనస్థలిపురంలోని జైత్రాహోటల్ లో మంగళవారం సర్పంచుల సమావేశం ఏర్పాటు చేసినట్లు సౌదాని భూమన్న యాదవ్ తెలిపారు.
రాష్ట్రంలోని సర్పంచులంతా రాజకీయాలకతీతంగా ఐక్యంగా తరలొచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే సర్పంచులకు పూర్తి పాలనా స్వేచ్ఛ, ఆర్థిక అధికారాలు కల్పించాలని వారు కోరారు.
