క్రిప్టో బిజినెస్ అంటరు..పిలిపించుకుని లూటీ చేస్తరు..ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ అవుతున్న ముఠా

క్రిప్టో బిజినెస్ అంటరు..పిలిపించుకుని లూటీ చేస్తరు..ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ అవుతున్న ముఠా
  • మూడు రోజుల కింద రూ.7 లక్షలు దోపిడీ  
  • నలుగురు రిమాండ్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌ బండ్లగూడ పరిధిలో క్రిప్టో కరెన్సీ బిజినెస్​చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి..తమ దగ్గరకు పిలిపించుకుని దోపిడీలు చేస్తున్న ఓ ముఠాను బండ్లగూడ పోలీసులు పట్టుకున్నారు. 

కంచన్​బాగ్​కు చెందిన ఫిట్‌‌నెస్ ట్రైనర్ సబేర్ బిన్ అహ్మద్ హద్రానీ అలియాస్ సైఫ్, కార్వాన్‌‌కు చెందిన స్టూడెంట్​మహమ్మద్ అబుల్ సలామ్, రాజేంద్రనగర్‌‌కు చెందిన విద్యార్థి మహమ్మద్ అనస్, పహాడీషరీఫ్‌‌కు చెందిన డ్రైవర్​మహమ్మద్ ఆసిఫ్, ఆసిఫ్ క్రిప్టో కరెన్సీ బిజినెస్​లో లాభాలు వస్తాయని ఫేస్​బుక్​ద్వారా పలువురిని సంప్రదిస్తారు. తర్వాత వారిని తామున్న చోటికి రప్పించుకుని నిలువు దోపిడీ చేస్తారు.

 బేగంబజార్‌‌కు చెందిన జేఆర్‌‌‌‌ చౌదరిని కూడా నిందితులు కొద్ది రోజుల కింద కొంతమంది సోషల్​మీడియా ద్వారా సంప్రదించారు. అతడిని నమ్మించడంతో రూ.7 లక్షలు తీసుకుని ఆగస్టు15న బండ్లగూడలోని ఇస్మాయిల్ నగర్‌‌కు వెళ్లాడు.

 వారి ప్లాన్​ప్రకారం చౌదరిని బెదిరించి డబ్బులను దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో 17న చాంద్రాయణగుట్టలోని కింగ్స్ స్నూకర్ వద్ద నిందితులను అరెస్ట్​చేశారు. డబ్బులతో ఆసిఫ్​పరారయ్యాడని, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ముఠా గతంలోనూ పలు నేరాలకు పాల్పడిందని తేలింది. చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ పర్యవేక్షణలో బండ్లగూడ సీఐ ఆర్. దేవేందర్, ఎస్సై ఎస్. నాగరాజ్ రెడ్డి కేసును చేధించారు.