CAT–2026 నోటిఫికేషన్ వచ్చేసింది.. ఐఐఎంలో ఎంబీఏ సీటు కొట్టేందుకు గోల్డెన్ ఛాన్స్..పూర్తి వివరాలు ఇవే!

 CAT–2026 నోటిఫికేషన్ వచ్చేసింది.. ఐఐఎంలో ఎంబీఏ  సీటు కొట్టేందుకు గోల్డెన్ ఛాన్స్..పూర్తి వివరాలు ఇవే!

దేశంలోని అత్యున్నత మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించే కటాఫ్ పరీక్ష క్యాట్-–2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఐఐఎంల్లో ఎంబీఏ చదవాలనుకునే ఆసక్తిగల అభ్యర్థుల కోసం అర్హతలు, ముఖ్యమైన తేదీలు, పరీక్షా విధానం తదితర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.  

వయోపరిమితి: పరీక్ష రాయడానికి గరిష్ట లేదా కనిష్ట వయోపరిమితి నిబంధనలు ఏవీ లేవు.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు రూ.2700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.1350 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15. 

అడ్మిట్ కార్డ్ విడుదల: నవంబర్ 4.

క్యాట్ పరీక్ష తేదీ: నవంబర్ 29.

రిజల్ట్స్: 2027, జనవరి మొదటివారం. 

సెలెక్షన్ ప్రాసెస్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ): కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సాధించిన ఓవరాల్, సెక్షనల్ పర్సంటైల్ ఆధారంగా తొలి దశ షార్ట్​లిస్టింగ్ ఉంటుంది.

డబ్ల్యూఏటీ, పీఐ: షార్ట్​లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత నైపుణ్య పరీక్ష (డబ్ల్యూఏటీ), పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ) నిర్వహిస్తారు.
కంపోజిట్ స్కోర్: క్యాట్ స్కోర్, అకడమిక్ మెరిట్ (10, 12, డిగ్రీ మార్కులు), వర్క్ ఎక్స్​పీరియన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందించి సీట్లను కేటాయిస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ iimcat.ac.inను సందర్శించండి. 

ఐఐఎంలో సీట్లు
దేశవ్యాప్తంగా మొత్తం 21 ఐఐఎంలు ఉండగా ప్రధానంగా ఎంబీఏ  కోర్సులకు సంబంధించి సుమారు 5,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక కోర్సులు కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం  జనరల్ 40.5 శాతం  ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కేటాయించారు. మిగిలిన సీట్లను  ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం, దివ్యాంగులకు కేటాయించారు.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
క్యాట్ పరీక్షను పూర్తిగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్,  టైప్ ఇన్ ది ఆన్సర్ విధానంలో ఉంటాయి. మొత్తం 204 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 68 ప్రశ్నలు ఇస్తారు. వాల్‌‌‌‌‌‌‌‌బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (బీఏఆర్​సీ) నుంచి 24 ప్రశ్నలు 72 మార్కులకు,  డేటా ఇంటర్‌‌‌‌‌‌‌‌ప్రెటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్ఆర్) నుంచి 22 ప్రశ్నలు 66 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (క్యూఏ) నుంచి 22 ప్రశ్నలు 66 మార్కులకు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు.  ప్రతి తప్పు సమాధానానికి  1 మార్కు కోత విధిస్తారు. ఈ ఎగ్జామ్ 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి  ఉంటుంది.  దివ్యాంగులకు అదనంగా 40 నిమిషాల సమయం కేటాయిస్తారు. ప్రతి విభాగానికి కచ్చితంగా 40 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఒక సెక్షన్ సమయం ముగిసే వరకు వేరే సెక్షన్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లడానికి నిబంధనలు అంగీకరించవు.

 టైప్ ఇన్ ది ఆన్సర్: ఈ ప్రశ్నలకు ఎలాంటి ఆప్షన్లు ఉండవు. స్క్రీన్​పై కనిపించే వర్చువల్ కీబోర్డ్ ద్వారా సరైన సమాధానాన్ని టైప్ చేయాలి. సరైన సమాధానానికి 3 మార్కులు లభిస్తాయి. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు.