విశాఖలో విషాదం: సెలవు కదా అని సరదాగా బీచ్ కి వెళ్లి.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు..

విశాఖలో విషాదం: సెలవు కదా అని సరదాగా బీచ్ కి వెళ్లి.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు..

ఏపీలోని విశాఖపట్నంలో విషాదం నెలకొంది.  సెలవు రోజు సరదాగా గడుపుదామని బీచ్ కి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. శుక్రవారం ( అక్టోబర్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  మధురవాడ మల్లయ్యపాలెంకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు సూర్యప్రకాష్, నితీష్, ప్రశాంత్ లు మరో ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి రిషికొండ ఐటీ హిల్స్ సమీపంలోని బీచ్ కు వెళ్లారు. ఫ్రెండ్స్ తో కలిసి నీటిలో దిగి గల్లంతయ్యారు ముగ్గురు విద్యార్థులు.

సముద్రంలో కెరటాలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో సూర్యప్రకాష్, నితీష్, ప్రశాంత్ లు సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఇది గమనించిన మిగతా స్నేహితులు బీచ్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే పోలీసులు, రెస్క్యూ టీంకు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు.

సెలవురోజు సరదాగా గడుపుదామని ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అప్పటిదాకా తమతో ఆడుకున్న ఫ్రెండ్స్ గల్లంతవ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మృతుల స్నేహితులు. తమ పిల్లలను సురక్షితంగా తమకు అప్పగించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.