న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అరంగ్రేటం కూడా చేయకుండానే టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని శుక్రవారం (అక్టోబర్ 2) ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తన ఆట ఇంకా ముగి సిపోలేదని.. టెస్ట్ ఫార్మాట్‌కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించానని తెలిపాడు.
తాను తొలిసారి రెడ్ బాల్ పట్టుకున్నప్పుడు తన వయసు పదేళ్లని గుర్తు చేసుకున్న చాహల్ ఆ బాల్‌తో గట్టి అనుబంధం ఏర్పడిందని చెప్పాడు. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడానని గుర్తు చేసుకున్నాడు. ఇండియా తరుఫున టెస్ట్ క్యాప్ ధరించాలన్న తన కల నెరవేరకుండానే దూరమవుతానని అనుకోలేదని ఎమోషనల్ అయ్యాడు. ఇక.. వన్డే, టీ20 ఫార్మాట్లలో మళ్లీ అవకాశం దక్కించుకుని జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
చాహల్ క్రికెట్ కెరీర్:
చాహల్ 2016లో జింబాబ్వేపై భారత జట్టు తరఫున వన్డే, టీ20ల్లోకి అరంగేట్రం చేశారు. చాహల్ టీమిండియా తరుఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. వన్డేల్లో 121 వికెట్లు, టీ20ల్లో 96 వికెట్లు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వివిధ ఫ్రాంచైజీల తరుఫున ఆడిన చాహల్ 200కు పైగా వికెట్లు పడగొట్టి టోర్నీ హయ్యెస్ట్ వికెట్ టేకర్స్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు. టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో ఒంటి చేత్తో విజయాలు అందించిన చాహల్ తన టెస్ట్ కల తీరకుండానే రెడ్ బాల్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
