కొబ్బరి బోండాం ధర రూ.120 ఏంటయ్యా బాబు ?.. బెంగళూరులో సామాన్యుల దోపిడీపై టెక్కీ పోస్ట్ వైరల్!

కొబ్బరి బోండాం ధర రూ.120 ఏంటయ్యా బాబు ?.. బెంగళూరులో సామాన్యుల దోపిడీపై టెక్కీ పోస్ట్ వైరల్!

సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండి, కొబ్బరి చెట్లు ఎక్కువగా దొరికే ప్రదేశంలోనే కొబ్బరి బోండాం రేటు ఎక్కువగా ఉండటం  ఎప్పుడైనా చూశారా ? అదేంటో కానీ, బెంగళూరులో మాత్రం ఇదే జరుగుతోంది. ఉత్తరాది నగరాలతో పోలిస్తే సిలికాన్ వ్యాలీలో కొబ్బరి నీళ్ల ధరలు చూసి ఓ టెక్కీ షాకయ్యారు. దీనిపై  ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. 

పరిత్ష్ శర్మ అనే ఎంట్రప్రెన్యూర్ తాజాగా 'ఎక్స్'లో  బెంగళూరులో జరుగుతున్న ఈ దోపిడీ గురించి ఓ పోస్ట్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే.. "ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో చూస్తే ఒక కొబ్బరి బోండాం మహా అయితే 60 రూపాయలు ఉంటుంది. పూణేలోనైతే 50 నుంచి 70 రూపాయల మధ్యే దొరుకుతుంది. కానీ, కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండే బెంగళూరుకు వెళ్తే మాత్రం సీన్ మాత్రం వేరేలా ఉంది. అదే సైజు కొబ్బరిబొండంకు  నేను ఏకంగా 100 నుంచి 120 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అంతేకాదు, బెంగళూరు ప్రజల పై ఆయన ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. "ఇక్కడ జనాలు అద్దెలు, ట్రాఫిక్ ఖర్చులు, తిండి.. ఇలా ప్రతీదానికి ఎక్కువే చెల్లిస్తూ అలవాటు పడిపోయారు. ఇదే ఛాన్స్ గా వ్యాపారులు  కూడా సింపుల్‌గా ప్రజలను మోసం చేస్తూ జేబులు చిల్లు పెడుతున్నారు" అని  విమర్శించారు.

దీనిపై నెటిజన్ల రియాక్షన్
ఈ పోస్ట్ చూశాక సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆయనతో ఏకీభవిస్తుంటే, మరికొందరు మాత్రం వాదనలను కొట్టిపారేస్తున్నారు.

"కొబ్బరికాయలకు కేరాఫ్ అడ్రస్ అయిన కోయంబత్తూరు, పొల్లాచి ప్రాంతాల్లోనే మాకు మంచి సప్లై ఉన్నా.. అక్కడ కూడా 60 రూపాయలు తీసుకుంటున్నారు" అని ఒకరు రాసుకొచ్చారు.

"నేను బెంగళూరు నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా దారిలో ఒకచోట  100-120 లోపే రూపాయలకే కొబ్బరిబొండం దొరికింది. కానీ పుదుచ్చేరికి వెళ్లేసరికి దాని రేటు 80 రూపాయలు అయింది" అని మరొకరు  అన్నారు.

అయితే అందరూ ఈ వాదనతో ఏకీభవించలేదు. "మీరు బెంగళూరులో ఎక్కడ ఏ ఏరియాలో కొబ్బరిబోండం  తాగుతున్నారో కానీ.. మారతహళ్లి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ 70 నుంచి 80 రూపాయలకే వస్తోంది" అని కొందరు గుర్తుచేశారు. "ఢిల్లీలో కూడా సౌత్ ఢిల్లీ లాంటి చోట్ల  కొబ్బరిబోండం  ధర 80 రూపాయల వరకు ఉందంటూ" ఇంకొందరు అంటున్నారు. 

మొత్తానికి చూస్తే.. ఇళ్లు, తిండి ఖర్చులతో పాటు కనీసం దాహం తీర్చుకోవడానికి తాగే కొబ్బరి నీళ్ల విషయంలోనూ బెంగళూరు వాసులు భారీగానే ఖర్చు చేస్తున్నారు అనేది ఈ చర్చ ద్వారా మరోసారి బయటపడింది.