హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని కొన్ని బాయ్స్ హాస్టల్స్ ఎంత దారుణంగా నడుస్తున్నాయో కళ్లకు కట్టిన ఘటన ఇది. హాస్టల్‌లో ఫుడ్ విషయంలో ఎందుకు అంత అయిష్టత చూపిస్తుంటారో ఈ ఘటనతో తేలిపోయింది. ఆహార భద్రతా ప్రమాణాలను సిటీలోని కొన్ని హాస్టల్స్ ఎలా తుంగలో తొక్కుతున్నాయో హెచ్-ఫాస్ట్ తనిఖీల్లో బయటపడింది.
H-FAST Inspects Boys Hostel, Food Safety Violations Found
— Hyderabad Food Adulteration Surveillance Team (@HFastHCP) August 17, 2026
On 14.08.2026, H-FAST, under the leadership of Smt. D. Ramya, SI of Police, and Sri P. Abhilash, SI of Police, along with H-FAST team members, in coordination with Smt. Sahithi, Food Safety Officer, GHMC, conducted an… pic.twitter.com/bWxSi5Df8L
పోలీస్ ఎస్ఐ డి. రమ్య, పి. అభిలాష్‌ల నేతృత్వంలో, హెచ్-ఫాస్ట్ టీంతో కలిసి, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా ఆఫీసర్ సాహితి.. సికింద్రాబాద్, దోమల్‌గూడలోని సాయి అశ్రయ్ బాయ్స్ హాస్టల్‌లో హెచ్-ఫాస్ట్ తనిఖీ నిర్వహించింది. వంటగది అపరిశుభ్రంగా, ఫ్లోర్, పైకప్పు అధ్వాన్నంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. పాడైపోయిన మునక్కాయలు, పాడైపోయిన కొబ్బరి కాయలు, పురుగులు పట్టిన 4 కిలోల శనగపిండి చూసి అధికారులు విస్తుపోయారు.
సిటీలో ప్రైవేట్ హాస్టళ్ల దందా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. విద్య, ఉపాధి కోసం నగరానికి వచ్చేవారు వీటినే ఆశ్రయిస్తారు. ఏరియా, వసతులను బట్టి ఒక్కో హాస్టల్ ప్రతి ఒక్కరికి కనీసం రూ.6 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. కానీ.. ఫుడ్ మాత్రం ఏమాత్రం రుచీపచీ లేని విధంగా వండి అక్కడ పడేస్తున్నారు. ప్రధానంగా వెస్ట్ జోన్ పరిధిలోని హైటెక్ సిటీ, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలతో పాటు, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, వెంగళావు నగర్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట, మెహిదీపట్నం, కాచిగూడ, సికింద్రాబాద్, అత్తాపూర్, ఉప్పల్, గాంధీ నగర్, విద్యానగర్, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్లు, సాఫ్ట్ వేర్ సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హాస్టళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చదువు, ఉద్యోగ ఉపాధి మార్గాలకు వెతుకుంటూ నగరానికి వచ్చేవారికి ఇవే ప్రధాన షెల్టర్లుగా ఉంటున్నాయి. వేలకు వేలు తీసుకుని కూడా కొన్ని హాస్టల్స్ నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
