కేంద్రం కీలక నిర్ణయం: ఈవీ, సీఎన్‌జీ, హైడ్రోజన్ వాహనాల లైఫ్ 5 ఏళ్లు పెంపు..!

కేంద్రం కీలక నిర్ణయం: ఈవీ, సీఎన్‌జీ, హైడ్రోజన్ వాహనాల లైఫ్ 5 ఏళ్లు పెంపు..!

దేశంలో గ్రీన్ మెుబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్,CNG/LNGతో నడిచే కమర్షియల్ వాహనాల వయస్సు పరిమితిని మరో 5 ఏళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్-1989కి సవరణలు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కీలక ముసాయిదాను విడుదల చేసింది. దీనిద్వారా గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాల యజమానులకు పెద్దపీట వేయాలని సర్కార్‌ ప్రణాళిక రూపొందించింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం నేషనల్ పర్మిట్ వ్యవస్థలో కొన్ని రకాల కమర్షియల్ వాహనాలకు ఉన్న 12, 15 సంవత్సరాల గడువును.. ఈ కొత్త సవరణ ద్వారా 17, 20 సంవత్సరాలకు పెంచనున్నారు. అయితే ఈ మినహాయింపు అన్ని రకాల వాణిజ్య వాహనాలకు వర్తించదని.. కేవలం బ్యాటరీతో నడిచేవి, హైడ్రోజన్ అండ్ నేజరల్ గ్యాస్ ఆధారంగా నడిచే వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేశారు. కమర్షియల్ రంగంలో క్లీన్ ఎనర్జీ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈమార్పుల ద్వారా వాహనాలకు నేషనల్ పర్మిట్ ప్రక్రియను మరింత సరళతరం చేయడంతో పాటు, ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దరఖాస్తుదారులు కోరుకుంటే నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్‌ను ఒకేసారీ 5 ఏళ్ల వరకు ఎలక్ట్రానిక్ విధానంలో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికోసం సంవత్సరానికి రూ.16వేల 500 చొప్పున ఐదేళ్లకు రూ.82వేల 500 ఫీజు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే వాహన్ (VAHAN) పోర్టల్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసి, డీలర్లు వాహన యజమానులకు సంబంధించిన వివరాలను ఆటోమేటిక్‌గా సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక టెంపరరీ రిజిస్ట్రేషన్ రూల్స్ విషయంలోనూ మార్పులు తెచ్చారు. బాడీ లేని చాస్సిస్ రిజిస్ట్రేషన్ గడువును 6 నెలలకు పొడిగించారు. వర్క్‌షాప్‌లలో జరిగే ఆలస్యాలు, ఇతర ఊహించని పరిణామాల వల్ల గడువు మీరితే మరో 30 రోజుల పాటు పొడిగించే అధికారాన్ని రిజిస్టరింగ్ అధికారులకు కల్పించారు. వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంటేషన్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా మార్చడానికి తాజా మార్పులు దోహదపడతాయి. 

ఈ ముసాయిదా నిబంధనలపై ఆగస్టు 10న నోటిఫికేషన్ విడుదల చేయగా.. అభ్యంతరాలు, సలహాలను స్వీకరించేందుకు 30 రోజుల సమయం ఇచ్చింది ప్రభుత్వం. అధికారిక గెజిట్‌ వెలువడిన తర్వాతే ఈ చట్ట సవరణలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు, గ్రీన్ వెహికల్స్ వాడకాన్ని పెంచడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మరింత ఊతమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.