ఇందిరా పార్క్వద్ద ఐటీ ఉద్యోగుల ఆమరణ దీక్ష

 ఇందిరా పార్క్వద్ద ఐటీ ఉద్యోగుల ఆమరణ దీక్ష
  •     ఇందిరా పార్క్​వద్ద టెక్​మహీంద్రా తొలగించిన నలుగురి నిరసన
  •     మద్దతుగా వచ్చిన సాఫ్ట్​వేర్ ఉద్యోగులు  

ముషీరాబాద్, వెలుగు : కార్పొరేట్ సంస్థలు సాఫ్ట్​వేర్​ఉద్యోగులకూ కార్మిక హక్కులను వర్తింపజేయాలని, తిరిగి తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని.. టెక్ మహీంద్రాలో ఉద్యోగం కోల్పోయిన భావన శర్మ,  శ్రీధర్, హరీశ్, కెల్విన్​డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో వారు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వీరికి మద్దతుగా వేరే కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్ మహీంద్రా నుంచి తమను అకారణంగా తొలగించిన అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. 

ఇన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నా ఐటీ మినిస్టర్​గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కంపెనీల వల్ల ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, గౌరవానికి భంగం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టెక్ మహీంద్రా యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేసేంతవరకు దీక్ష ఆపేది లేదన్నారు. అయితే, పోలీసులు అక్కడకు చేరుకుని అనుమతి లేదని, ఇతర ఇబ్బందులు వస్తాయని వారికి సర్ధి చెప్పడంతో విరమించి వెళ్లిపోయారు. కానీ, తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. జేఎన్టీయూ స్టూడెంట్​లీడర్​రుచిత్, వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీల మాజీ ఉద్యోగులు రమేశ్, సతీష్ కుమార్, మధుకుమార్, సుజని, సుమన్ పాల్గొన్నారు.