జార్ఖండ్‌లో జేపీఎస్‌సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ముఖంగా మారిన వ్యక్తి దేవేంద్ర నాథ్ మహతో. 33 ఏళ్ల ఈ విద్యార్థి నాయకుడు గత దశాబ్దంగా విద్యార్థి హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఆగస్టు 10న వేలాది జార్ఖండ్ విద్యార్థులు రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించడానికి ర్యాలీ చేశారు. ఆ జనసమూహం మధ్యలో దేవేంద్ర నాథ్ మహతోను అతని మద్దతుదారులు భుజాలపై ఎత్తుకున్నారు. ఒక చేతిలో మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఫొటో, మరో చేయి పైకెత్తి నినాదాలు చేస్తూ అతను కనిపించాడు. కెమెరాలు అతడిని ఫాలో అవుతుండగా, అతనిపై పూల వర్షం కురిసింది.
ఆ మార్చ్ తర్వాత అతను ఆసుపత్రిలో చేరినా, ఆగస్టు 2 నుంచి కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష ఆపలేదు. జేఎల్‌కేఎం నాయకుడైన దేవేంద్ర జేపీఎస్‌సీ, ఫలితాలు వచ్చిన తర్వాత జులై 5న విలేకరుల సమావేశం పెట్టి పరీక్ష ప్రక్రియను ప్రశ్నించాడు. గవర్నర్‌కు డిమాండ్లు ఇచ్చాడు. జులై 25న బాపు వాటికలో నిరవధిక ధర్నా చేశాడు. ప్రభుత్వంతో మూడుసార్లు చర్చలు జరిగినా, 2023-–25 జేపీఎస్‌సీ, ప్రిలిమ్స్, బ్యాక్‌లాగ్ పరీక్షలు రద్దు అయినా, అతని డిమాండ్ మారలేదు. టీడీపీఎల్ అనే ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించే జేపీఎస్‌సీ, సీజీఎల్ సహా అన్ని పరీక్షలను రద్దు చేయాలి. సీబీఐ విచారణ జరపాలి అనేది అతని ప్రధాన డిమాండ్. దేవేంద్ర 2024 లోక్‌సభలో రాంచీ నుంచి స్వతంత్రంగా పోటీ చేసి 1.4 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు. ఒక సాధారణ ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు, వ్యవస్థలోని అన్యాయాన్ని చూసి లక్షల మంది గొంతుగా మారాడు.
- ఇరికి మహేష్, యువ న్యాయవాది
