వెలుగు స్పెషల్ : నల్లా నర్సింహులు పోరాట యోధుడు..ఇవాళ(అక్టోబర్ 2) శత జయంతి ఉత్సవాలు

వెలుగు స్పెషల్ : నల్లా నర్సింహులు పోరాట యోధుడు..ఇవాళ(అక్టోబర్ 2) శత జయంతి ఉత్సవాలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో  ప్రముఖ పోరాట యోధుడు నల్లా నర్సింహులు. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ రజాకార్ల పాలన కొనసాగుతుండగా...  ప్రజా సంఘటనలు, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు, అనంతరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విస్తరించింది. ఈ చారిత్రక పరిణామాల్లో కడవెండి గ్రామం ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. నల్లా నరసింహులు ఆ నేలలోనే  పెరిగి,  ఆ కాలపు సామాజిక పరిస్థితులను ప్రత్యక్షంగా అనుభవించి  ప్రజా ఉద్యమంలోకి  ప్రవేశించాడు.  సాధారణ  పేద చేనేత కుటుంబంలో జన్మించిన ఒక యువకుడు సామాజిక అన్యాయాలను ప్రశ్నిస్తూ సాయుధ పోరాట యోధుడిగా ఎదిగాడు. 

గ్రామస్థాయి కార్యకర్తగా ప్రారంభమై జనగామ ప్రాంతంలోని ప్రముఖ ఉద్యమ నాయకుడిగా ఎదగడం నల్లా నరసింహులు జీవితంలోని ప్రధాన పరిణామం. చేనేత వృత్తే  జీవనాధారంగా కలిగిన పేద పద్మశాలి  కుటుంబంలో నల్లా నరసింహులు 1926 అక్టోబర్ 2న అప్పటి జనగామ తాలూకాలోని కడవెండి గ్రామంలో  నల్లా లచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పుట్టిన ప్రాంతం  భూస్వాములైన విసునూరు దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి ఆధిపత్యంలో వెట్టిచాకిరి, దోపిడీ, అణచివేత,  సామాజిక-, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉండేది. పేదరికం, చేనేత జీవితం, సామాజిక అసమానతలు ఆయనను  ఎంతగానో ప్రభావితం చేసి పోరుబాట పట్టించాయి.

రైతాంగ ఉద్యమ  చరిత్రలో  కడవెండికి ప్రత్యేక స్థానం

కడవెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య 1946 జులై 4న జరిగిన ఘర్షణలో మరణించడం తెలంగాణ రైతాంగ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ సంఘటనతో కడవెండి పేరు తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో ప్రాధాన్యత సంతరించుకుంది.  నల్లా నరసింహులు కూడా అదే సామాజిక వాతావరణంలో ప్రజా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఎదిగారు.  నరసింహులు  జీవితాన్ని మార్చిన ప్రధాన మలుపుల్లో ఒకటి ఆంధ్ర మహాసభతో పరిచయం. ఆంధ్ర మహాసభ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై చర్చలు, సంఘటిత కార్యక్రమాలు,  సామాజిక చైతన్యం పెరిగాయి.  భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభ అనంతరం గ్రామస్థాయి సంఘటనలకు మరింత ఊపు వచ్చింది. కడవెండిలో కూడా ప్రజలను సంఘటితం చేయడం,  వెట్టిచాకిరి,  అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాల్లో నరసింహులు కీలక పాత్ర పోషించారు. 

వజ్రమ్మ క్రియాశీలక పాత్ర

నల్లా నరసింహులు  భార్య వజ్రమ్మ  నరసింహులు అజ్ఞాత జీవితంలోకి వెళ్లిన సమయంలో ఆమె కూడా ఆయనతో కలిసి ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నారు. మహిళలను  ఉద్యమంలో  భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాల్లో  వజ్రమ్మ  క్రియాశీలక పాత్రను పోషించారు.  ఆమె కూడా అరెస్టుకు గురై జైలు జీవితాన్ని అనుభవించారు.  నల్లా నరసింహులు ప్రజా ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి దళాలను ఏర్పాటు చేసిన నాయకుడిగా సంఘాల ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజా న్యాయ వ్యవస్థలు, ప్రత్యామ్నాయ పరిపాలనా విధానాలు అవలంబించడం ద్వారా జనగామ ప్రాంత దళ నాయకుడిగా ఎదిగారు.  నరసింహులు  నాయకత్వంలో దాదాపుగా 122 దళాలు ఏర్పాటయ్యాయి. 

తెలంగాణ టైగర్

1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం  ప్రధానంగా నిజాం పాలనకు, భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగింది. వెట్టిచాకిరి నిర్మూలన, కౌలు రైతుల హక్కులు, భూమి సమస్యలు  ఉద్యమంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. నల్లా నరసింహులు ఈ ఉద్యమంలో జనగామ ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకుడిగా పనిచేశారు. 1947 సెప్టెంబర్ 11న నిజాం ప్రభుత్వానికి  వ్యతిరేకంగా సాయుధ పోరాటం మరింత ఉధృతమయింది.  అనేక ప్రాంతాల్లో ఉద్యమ కార్యకలాపాలు  తీవ్రతరం కావడంతో నల్లా నరసింహులు అజ్ఞాత జీవితంలోకి వెళ్లారు. కోర్టుల్లో ఆయన ధైర్యంగా తన వాదనలు వినిపించిన తీరు,  పోలీసు,  న్యాయపరమైన ఒత్తిడులను ఎదుర్కొన్న విధానం కారణంగా తనని ఎన్నో సందర్భాలలో పట్టుకున్న పోలీసులే  ‘తెలంగాణ టైగర్’ అని పిలవడం, సాటి పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పడంతో జనగామ ప్రాంతంలో ఆయనను  ‘విప్లవ సింహం’ వంటి పేరుతో స్మరిస్తారు.  ‘తెలంగాణ ట్వెల్వ్”గా చరిత్రలో ప్రస్తావించిన  పన్నెండు మంది ఖైదీలకు మరణశిక్ష విధించిన సందర్భంలో  జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు,  న్యాయపరమైన చర్యల నేపథ్యంలో ఆ ఉరిశిక్షలు ఆ సమయంలో అమలు కాలేదు. 

నేడు ఘనంగా శతజయంతి ఉత్సవాలు

1951లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించుకునే నిర్ణయం తీసుకుంది.  నల్లా నరసింహులు  1951 అక్టోబర్ 21న సాయుధ పోరాట విరమణకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. 1987లో తెలంగాణ సాయుధ పోరాటం 40వ వార్షికోత్సవ సందర్భంలో ఉద్యమ యోధులు తమ అనుభవాలను నమోదు చేయాలనే పిలుపు వచ్చినప్పుడు, సాధారణ నివేదికకు బదులుగా నల్లా నరసింహులు తన అనుభవాలను విస్తృతంగా రాశారు.  ఆ రచన  ‘తెలంగాణ సాయుధ పోరాటం..  నా అనుభవాలు’ అనే పుస్తకంగా  రూపుదిద్దుకుంది. ఇది 1989లో ప్రచురితమైంది.  పేద రైతులకు సుమారు 10 లక్షల ఎకరాల భూమిని నల్లా నర్సింహులు  నేతృత్వంలో పంపిణీ చేశారు. అదేవిధంగా పోరాటంలో మరణించిన 4,000 మంది గురించి కూడా ఆయన తన స్వీయ చరిత్రలో పొందుపరిచారు.  ఆయన జీవితం గురించి వచ్చిన జీవితచరిత్రలో ‘జీవితమే ఒక నిరంతర పోరాటం’ అనే  భావవ్యక్తీకరణ చేశారు.  

నల్లా నర్సింహులు జీవితాన్ని పరిశీలిస్తే మూడు విభిన్న దశలు స్పష్టంగా కనిపిస్తాయి.   పేద చేనేత కుటుంబంలో బాల్యం, విద్య, వృత్తి.  ఆంధ్ర మహాసభ పరిచయం, గ్రామ సంఘాల నిర్మాణం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అజ్ఞాత జీవితం, అరెస్టులు,  జైలు.  1959లో విడుదల తర్వాత జీవితం.  ఈ మూడు దశల సమాహారమే నల్లా నరసింహులు సంపూర్ణ జీవితాన్ని నిర్మించింది. నల్లా నరసింహులు 1993 నవంబర్ 5న  తుదిశ్వాస విడిచి అమరులయ్యారు.  వారి పోరాట స్ఫూర్తి, పోరాటపటిమను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో మన ఆలోచన సాధన సమితి ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసి, వారి జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని నిశ్చయించింది.  నేడు జరిగే నల్లా నర్సింహులు శతజయంతి ఉత్సవాన్ని ఘనంగా  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి వారికి 
నిజమైన నివాళి అర్పిద్దాం.
 

- కటకం నర్సింగ్ రావు
వ్యవస్థాపక అధ్యక్షుడు, 
- మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర 
రాష్ట్ర అధికార ప్రతినిధి, 
మన ఆలోచన సాధన సమితి 

 

 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 

[email protected] 

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.