గిగ్ వర్కర్లకు భరోసా నిధి.. 1% కు ఏటా వంద కోట్లకు పైనే.. 2% మైతే రూ.200 కోట్లపైగా !

గిగ్ వర్కర్లకు భరోసా నిధి.. 1% కు ఏటా వంద కోట్లకు పైనే.. 2% మైతే రూ.200 కోట్లపైగా !
  • 6 లక్షల మందికి సామాజిక భద్రత.. సెస్​భారం కంపెనీలపైనే
  • తెలంగాణ గిగ్ సంక్షేమ నిధికి నెలకు యావరేజ్​గా రూ.10  కోట్ల రాబడి
  • ఫుడ్ డెలివరీ, క్యాబ్ సేవల నుంచే అధిక వాటాగా రానున్న వెల్ఫేర్ ఫండ్
  • రియల్ టైమ్ ట్రాకింగ్​తో గిగ్ నిధి.. ఐదు పనిదినాల్లో చెల్లింపు తప్పనిసరి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న దాదాపు 6 లక్షల మంది గిగ్, ప్లాట్‌‌‌‌ఫామ్ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చిన ‘తెలంగాణ ప్లాట్‌‌‌‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ నిబంధనలు-2026’ ప్రకారం అగ్రిగేటర్ కంపెనీలు తమ ప్రతి లావాదేవీ పేఅవుట్‌‌‌‌పై గరిష్టంగా 2 శాతం మించకుండా సంక్షేమ నిధి ఫీజు (డబ్ల్యూఎఫ్ఎఫ్) చెల్లించాలి. 

ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం 1 శాతం సెస్ విధించినా నెలకు రూ.8.55 కోట్లు, ఏడాదికి రూ.102.60 కోట్లు సమకూరనున్నాయి. గరిష్టంగా 2 శాతం సెస్ విధిస్తే ఈ మొత్తం ఏడాదికి రూ.205.20 కోట్లకు చేరుతుంది. నీతి ఆయోగ్, రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) నివేదికల ఇండస్ట్రీ బెంచ్‌‌‌‌మార్క్ గణాంకాల ఆధారంగా ఈ అంచనాలు రూపొందించారు. 

దేశీయ గిగ్ మార్కెట్‌‌‌‌లో తెలంగాణ వాటా 8 నుంచి 10 శాతం (సగటున 9 శాతం) ఉండటంతో రాష్ట్రంలో నెలకు రూ.855 కోట్లు, ఏడాదికి రూ.10,260 కోట్ల మేర కార్మికుల పేఅవుట్ లావాదేవీలు జరుగుతున్నాయి. సంక్షేమ నిధి ఫీజును పూర్తిగా అగ్రిగేటర్ సంస్థలే భరించాలి. కార్మికుల వేతనాలు, కమీషన్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొత్తాన్ని కట్ చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టిప్స్, ఇన్సెంటివ్‌‌‌‌లు, రెఫరల్ బోనస్‌‌‌‌లను సెస్ లెక్కింపు నుంచి మినహాయించింది. దీంతో కార్మికుల నికర ఆదాయానికి కోత పడకుండా రక్షణ కల్పించింది.

43 నెలలుగా పెరుగుతున్న లావాదేవీలు

గత 43 నెలల గిగ్ ఎకానమీ గణాంకాలను పరిశీలిస్తే జాతీయ మార్కెట్‌‌‌‌లో తెలంగాణ వాటా సగటున 9 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో రూ.68,266.67 కోట్ల పేఅవుట్లు జరగగా.. తెలంగాణ వాటా రూ.6,144 కోట్లు. దీనిపై 1 శాతం సెస్‌‌‌‌తో రూ.61.44 కోట్లు, 2 శాతం సెస్‌‌‌‌తో రూ.122.88 కోట్లు సమకూరే అవకాశం ఉంది. 2024–25లో జాతీయ పూల్ రూ.86,133.33 కోట్లకు పెరగగా.. రాష్ట్ర వాటా రూ.7,752 కోట్లకు చేరింది. 2025–26లో జాతీయ స్థాయిలో రూ.1,05,600 కోట్ల లావాదేవీలు జరగగా.. తెలంగాణ వాటా రూ.9,504 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2026 వరకు 7 నెలల్లో జాతీయ పూల్ రూ.66,500 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.5,985 కోట్లు. దీనిపై 1 శాతం సెస్‌‌‌‌తో రూ.59.85 కోట్లు, 2 శాతం సెస్‌‌‌‌తో రూ.119.70 కోట్లు సమకూరనున్నాయి.

ఫుడ్ డెలివరీదే అగ్రస్థానం 

హైదరాబాద్ అర్బన్‌లో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి టైర్–2 సిటీల్లో పనిచేస్తున్న గిగ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లను చట్టంలోని షెడ్యూల్-I పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని నాలుగు సేవా విభాగాలుగా వర్గీకరించారు. 2026–27 వార్షిక రన్-రేట్ (ఏడాదికి రూ.10,260 కోట్లు) ప్రకారం రాష్ట్ర గిగ్ మార్కెట్‌‌‌‌లో ఫుడ్ డెలివరీ, క్విక్-కామర్స్ రంగం 42% వాటాతో మొదటి స్థానంలో ఉంది. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, ఇన్‌‌‌‌స్టామార్ట్ ద్వారా నెలకు రూ.359.10 కోట్లు, ఏడాదికి రూ.4,309.20 కోట్ల పేఅవుట్లు జరుగుతున్నాయి. 

వీటిపై 1 శాతం సెస్‌‌‌‌తో నెలకు రూ.3.59 కోట్లు, ఏడాదికి రూ.43.09 కోట్లు సమకూరనున్నాయి. రైడ్-షేరింగ్, క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలు 33% వాటాతో రెండో స్థానంలో ఉన్నాయి. ఉబర్, ఓలా, ర్యాపిడో, మన యాత్రి ద్వారా నెలకు రూ.282.15 కోట్లు, ఏడాదికి రూ.3,385.80 కోట్ల పేఅవుట్లు నమోదవుతున్నాయి. వీటిపై 1 శాతం సెస్‌‌‌‌తో నెలకు రూ.2.82 కోట్లు, ఏడాదికి రూ.33.86 కోట్లు నిధికి వస్తాయి. ఈ-కామర్స్, హైపర్-లోకల్ లాజిస్టిక్స్ రంగం 17 శాతం వాటా కలిగి ఉంది. అమెజాన్, ఫ్లిప్‌‌‌‌కార్ట్, పోర్టర్, డెలివరీ ద్వారా నెలకు రూ.145.35 కోట్లు, ఏడాదికి రూ.1,744.20 కోట్ల పేఅవుట్లు జరుగుతున్నాయి. 1 శాతం సెస్‌‌‌‌తో నెలకు రూ.1.45 కోట్లు, ఏడాదికి రూ.17.44 కోట్ల ఆదాయం సమకూరనుంది. హోమ్ సర్వీసెస్, ఫార్మసీ, ఇతర సేవల రంగం 8% వాటాతో నాలుగో స్థానంలో ఉంది. అర్బన్ కంపెనీ, 1ఎంజీ, ఫార్మ్‌‌‌‌ఈజీ ద్వారా నెలకు రూ.68.40 కోట్లు, ఏడాదికి రూ.820.80 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిపై 1 శాతం సెస్‌‌‌‌తో నెలకు రూ.0.68 కోట్లు, ఏడాదికి రూ.8.21 కోట్లు సంక్షేమ నిధికి అందనున్నాయి.

బీమా నుంచి విద్య వరకు ప్రయోజనాలు

ఏటా సమకూరే రూ.102.60 కోట్ల నుంచి రూ.205.20 కోట్ల నిధిని గిగ్ కార్మికుల ప్రమాద బీమా, ఆరోగ్య రక్షణ, ప్రసూతి ప్రయోజనాలు, పెన్షన్ పథకాలు, అత్యవసర ఆర్థిక సాయం, పిల్లల విద్యా ప్రోత్సాహకాల కోసం వినియోగించనున్నారు. గుర్తింపు కార్డులు, యూనిక్ ఐడీలు జారీ చేయడంతో పాటు ప్లాట్‌‌‌‌ఫామ్ కంపెనీలు ఐడీలను బ్లాక్ చేయకుండా అడ్డుకట్ట వేయనున్నారు. కార్మికుల శ్రమకు తగిన సామాజిక భద్రత కల్పించడంలో ఈ నిధి కీలక పాత్ర పోషించనుంది.

రియల్ టైమ్‌‌‌‌లో పర్యవేక్షణ

సంక్షేమ నిధి చెల్లింపుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి నెల ముగిసిన ఐదు పనిదినాల్లోగా అగ్రిగేటర్ సంస్థలు తాము చెల్లించాల్సిన సంక్షేమ నిధి ఫీజును లెక్కించి సంక్షేమ బోర్డు జాతీయ బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ‘సంక్షేమ నిధి ఫీజు ధ్రువీకరణ వ్యవస్థ’ ద్వారా ప్రతి పేఅవుట్, సెస్ చెల్లింపును రియల్ టైమ్‌‌‌‌లో పర్యవేక్షిస్తారు. ఏదైనా సంస్థ పొరపాటున ఎక్కువ ఫీజు చెల్లిస్తే 90 రోజుల్లోగా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డు నియమించిన అధికారి 30 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. గడువు దాటి ఆలస్యంగా చెల్లించే కంపెనీల నుంచి సాధారణ వడ్డీ వసూలు చేస్తారు.