తెలంగాణలో విద్య గురించి మాట్లాడితే.. ర్యాంకులు, కార్పొరేట్ పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం, పోటీ పరీక్షలు, టెక్నాలజీ చుట్టూనే చర్చ సాగుతోంది. కానీ పట్టణాల మెరుపు దాటి పల్లెబాట పడితే మరో తెలంగాణ కనిపిస్తుంది. అక్కడ బడి ఉంది. పిల్లలు ఉన్నారు. కానీ కొన్నిచోట్ల తరగతి గదులు, ఉపాధ్యాయులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ప్రహరీ గోడ వంటి కనీస సౌకర్యాలే నామమాత్రంగా ఉన్నాయి. ఈ వాస్తవాన్ని చూపిస్తున్నదే తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ చేపట్టిన ‘బడి కోసం బస్సుయాత్ర’. విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విద్యావ్యవస్థలోని వాస్తవ పరిస్థితులను దగ్గరగా చూసిన వ్యక్తి. ఆ బాధ్యతల నుంచి ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా విద్యను వదిలి పెట్టకుండా, ప్రభుత్వ బడుల పరిస్థితి మారాలనే లక్ష్యంతో ఇప్పుడు గ్రామాలు, పాఠశాలల గడపలు తిరుగుతున్నారు. ఒకప్పుడు విద్యావ్యవస్థలో కీలక బాధ్యత వహించిన అధికారి ఆకునూరి మురళి.
ఇప్పుడు అదే వ్యవస్థలోని లోపాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు బస్సుయాత్ర చేయాల్సి రావడం తెలంగాణ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల తీవ్రతను అర్థం చేసుకునే ఒక సందర్భం. ఇది ప్రభుత్వ బడుల పరిస్థితిపై సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే ప్రయాణం.
విద్యను హక్కుగా ప్రకటిస్తే సరిపోతుందా?
ఒకవైపు డిజిటల్ ఎడ్యుకేషన్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఆధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి విద్య గురించి మాట్లాడుతున్నాం. మరోవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, సరిపడా ఉపాధ్యాయులు కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యను హక్కుగా ప్రకటించడం మాత్రమే సరిపోతుందా? ఆ హక్కును అందించే ప్రభుత్వ పాఠశాలలకు తగిన నిధులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా?. ఐదు తరగతులకు రెండు గదులు ఉన్న ప్రభుత్వ బడులు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలోని నజీరాబాద్, ముదిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలకు రెండు తరగతి గదులే ఉన్నాయి. ఐదు తరగతులు. రెండు గదులు. ఇది ఒక్క రెండు గ్రామాల సమస్య కాదు. తెలంగాణలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జవహర్‌నగర్ గబ్బాలపేటలో దాదాపు 50 వేల జనాభాకు అద్దె భవనంలో చిన్నగా రెండు గదులతో ఒకే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. ఇది ఒక్క గబ్బాలపేట సమస్య కాదు. హైదరాబాద్‌లోని అనేక బస్తీల్లో పిల్లల సంఖ్యకు సరిపడా ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడం.
ఒక్క ఉపాధ్యాయుడితో ఐదు తరగతులు
ఒక పాఠశాలలో ఐదు తరగతులు ఉంటాయి. కానీ బోధించడానికి ఒక్క ఉపాధ్యాయుడే ఉంటాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ ఒక్క టీచరే ఐదు తరగతుల పిల్లలను చూసుకోవాలి. ఒక క్లాసులో పాఠం చెబుతుంటే మిగతా పిల్లలు తమ వంతు కోసం ఎదురుచూడాల్సిందే. హాజరు తీసుకోవాలి, పాఠాలు చెప్పాలి, రికార్డులు రాయాలి, మధ్యాహ్న భోజనం చూడాలి. అన్నీ ఒక్కరే చూసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు పూర్తిస్థాయిలో బోధన అందడం కష్టమే. బడి నడుస్తోంది. కానీ పిల్లలకు కావాల్సిన విద్య అందుతోందా? ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధన, ఇంగ్లీష్, కంప్యూటర్, లైబ్రరీ, ఆటస్థలం, తాగునీరు వంటి సౌకర్యాలపై తల్లిదండ్రులకు నమ్మకం లేకపోతే ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్లడం సహజం. కానీ అక్కడి ఫీజులు పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పెంచుతున్నాయి. అందుకే ప్రైవేట్ ఫీజుల నియంత్రణతోపాటు ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
బడి సంపూర్ణ పాఠశాలగా ఉండాలి
బడి అంటే రెండు గదులు. ఇద్దరు టీచర్లు ఉండటం మాత్రమే కాదు. పిల్లల భవిష్యత్తుకు అవసరమైన అన్ని వసతులతో కూడిన సంపూర్ణ పాఠశాలగా ఉండాలి. విద్యాశాఖలో పనిచేసిన సమయంలో ఆకునూరి మురళి రూపొందించిన 52 అంశాలతో కూడిన ఆదర్శ ప్రభుత్వ పాఠశాల నమూనా ఇదే ఆలోచనను ముందుకు తెచ్చింది. ఆ నమూనాతో ఆరుట్లలో పాఠశాలను ఏర్పాటుచేశారు. ప్రతి మండలంలో అలాంటి 52 అంశాలతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు కనీసం మూడు ఏర్పాటు చేయాలని ‘బడికోసం బస్సుయాత్ర’ ద్వారా టీపీఎఫ్ డిమాండ్ చేస్తోంది. బడి ఉండటం మాత్రమే కాదు. పిల్లలు కోరుకునే బడి ఉండాలి. రెండు గదులు, ఇద్దరు టీచర్లతో బడి నడిపించడం కాదు. నాణ్యమైన విద్యకు అవసరమైన అన్ని వసతులతో పాఠశాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉండాలి. ఉన్నత చదువుల కోసం గ్రామాల నుంచి 150, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం దగ్గర్లో ఉన్న మండలంలోనే నాణ్యమైన విద్య, మెరుగైన కళాశాలలు, అవసరమైన కోర్సులు అందుబాటులో ఉంటే పిల్లలు ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు.
బడ్జెట్లో విద్యకు చోటెంత.. బడిలో మార్పెంత?
తెలంగాణ 2026–27 బడ్జెట్ మొత్తం రూ. 3.24 లక్షల కోట్లు. అందులో విద్యారంగానికి సుమారు రూ.26,600 కోట్లు, అంటే 8.22 శాతం కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ‘బడికోసం బస్సు యాత్ర’ గ్రామాల్లో చూపిస్తున్న వాస్తవం మరో ప్రశ్నను ముందుకు తెస్తోంది. బడ్జెట్లో కేటాయింపు ఎంత అన్నదే కాదు. ఆ నిధులు బడి గడప దగ్గరకు వస్తున్నాయా? తరగతి గదులు పెరుగుతున్నాయా? ఉపాధ్యాయుల కొరత తీరుతోందా? తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ వంటి కనీస సౌకర్యాలు అందుతున్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలి. బడ్జెట్ పుస్తకంలో కనిపించే కేటాయింపు. బడి ఆవరణలో కనిపించే మార్పుగా మారినప్పుడే ఆ లెక్కకు అర్థం. ‘బడికోసం బస్సుయాత్ర’ అదే మార్పుకోసం క్షేత్రస్థాయి నుంచి ప్రశ్నిస్తోంది. టీపీఎఫ్ విద్యకు బడ్జెట్లో 18 శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఇది కేవలం బడ్జెట్ పెంచాలనే డిమాండ్ కాదు. ప్రభుత్వ బడుల పరిస్థితిని మార్చాలనే డిమాండ్.
ఆరుట్ల చూపించిన ఆచరణాత్మక మార్గం
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక మోడల్‌గా నిలుస్తోంది. అక్కడ బడి అభివృద్ధి పనులను కేవలం నిర్మాణ సంస్థలకే పరిమితం చేయకుండా స్కూల్
డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి తల్లిదండ్రులను నేరుగా భాగస్వాములను చేశారు. ఈ కమిటీలో 30మంది తల్లిదండ్రులతోపాటు పాఠశాల అధిపతి, ప్రభుత్వ ఇంజినీర్ ఉన్నారు. పనుల అమలు, అవసరాల గుర్తింపు, పర్యవేక్షణలో కమిటీ పాత్రను కల్పించారు. ఆరుట్లలో తల్లిదండ్రుల కమిటీ ప్రతి శనివారం సమావేశమై పాఠశాల అవసరాలపై చర్చించి, తీర్మానాలు చేసి కార్యాచరణ చేపడుతున్నట్లు సభ్యులు తెలిపారు. బాధ్యతను తల్లిదండ్రులు తీసుకున్నప్పుడే ఆ బడి నిజంగా ప్రజల బడిగా మారుతుంది. ఆరుట్ల అందిస్తున్న సందేశం ఇదే బడికి భవనం మాత్రమే కాదు, బాధ్యత వహించే సమాజం కూడా కావాలి.
కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ బడుల్లో కల్పించాలి
ప్రభుత్వ బడిలో చదివితే పోటీ ప్రపంచంలో పిల్లలు వెనుకబడిపోతారనే భయంతో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు అప్పుచేసి మరీ ప్రైవేట్ స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నారు. పేదవాడి పిల్లవాడికి కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య ఎందుకు అందడం లేదో ప్రభుత్వం తెలపాలి. రూ. వేల కోట్లతో మౌలిక వసతులు నిర్మించగలిగే ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా ఎందుకు తీర్చిదిద్దకూడదు? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, విధానాలు మారుతున్నాయి. కానీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సమస్యలు పెద్దగా మారడం లేదు.
ఎన్నికల సమయంలో విద్యపై హామీలు వినిపిస్తాయి. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత బడికి వచ్చే మార్పు మాత్రం నెమ్మదిగానే కనిపిస్తోంది. ఒక తరం పిల్లలు పాఠశాల దశను దాటిపోతున్నా. మరో తరం కూడా అదే సమస్యలను ఎదుర్కొంటోంది. ఇది ప్రభుత్వ విద్యకు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది. ఆరుట్లలో మాదిరిగా 52 అంశాలతో సమగ్రంగా అభివృద్ధి చేసిన పాఠశాలలు ప్రతి మండలంలో కనీసం మూడు ఉండాలి. నాణ్యమైన ప్రభుత్వ బడులు ప్రతి పిల్లవాడికి అందుబాటులోకి వచ్చినప్పుడే ‘బంగారు తెలంగాణ’ అనే మాటకు నిజమైన అర్థం ఉంటుంది.
- బసడ సంపత్ యాదవ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
