వెలుగు స్పెషల్ : జెన్-జీకి  దిక్సూచి గాంధీ 

వెలుగు స్పెషల్ : జెన్-జీకి  దిక్సూచి గాంధీ 

గాంధీ అంటే  పేరు కాదు ఒక విలువ.  ఒకప్పుడు  సామ్రాజ్యవాదాన్ని సవాలు చేసిన ఆ ఆలోచనలే  నేడు మనలోని స్వార్థాన్ని, అసహనాన్ని, హింసను, అవినీతిని, అబద్ధాన్ని ప్రశ్నిస్తున్నాయి.  అందుకే  గాంధీని ప్రతిఏటా  గుర్తుచేసుకోవడం సులభం  కానీ, ఆయన చూపిన దారిలో  నడవడం మాత్రం కష్టం.  గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి.. సత్యం, అహింస గురించి ప్రసంగించి ఆ తర్వాత యథావిధిగా మన జీవితం కొనసాగిస్తే  అది గాంధీని స్మరించినట్లేకాని ఆయనను అనుసరించినట్లు కాదు.  గాంధీ నేటి తరానికి నిజంగా అవసరమా?  సమాధానం స్పష్టమే.  గతంలో కంటే  నేడు మరింత అవసరం.  ఎందుకంటే  సాంకేతికత మనిషి చేతికి అపారమైన శక్తిని ఇచ్చింది. కానీ ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో చెప్పే నైతిక దిక్సూచి అంతగా బలపడలేదు.

సమాచార వేగం పెరిగింది. జెన్–జీకి  నిజానిజాలు  తెలుసుకునే ఓపిక తగ్గింది. అభిప్రాయ స్వేచ్ఛ పెరిగింది. భిన్నాభిప్రాయాలను  భరించే  సంస్కారం తగ్గుతోంది.  సంపద పెరిగినా.. సమానత్వంపై ప్రశ్నలు  మాత్రం అలాగే ఉన్నాయి. ఇలాంటి కాలంలో గాంధీ జీవితాన్ని మళ్లీ చదవాల్సిన 
అవసరం ఉంది. 

రాజకీయాలలో నైతికత ఉండాలి

గాంధీ  రాజకీయాలను  కేవలం  అధికారాన్ని సాధించే  సాధనంగా చూడలేదు.  రాజకీయాలకి  నైతికత  ఉండాలని పట్టుదలగా నమ్మారు.  రాజకీయాల్లో  భేదాభిప్రాయాలు సహజమే. కానీ  ప్రత్యర్థిని శత్రువుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. విమర్శను దేశద్రోహంగా,  ప్రశ్నను అవిధేయతగా, భిన్నాభిప్రాయాన్ని శత్రుత్వంగా పరిగణించే ధోరణి ఏ సమాజానికీ ఆరోగ్యకరం కాదు.  గాంధీ రాజకీయ పద్ధతి మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది.. ప్రత్యర్థిని ఓడించడం కంటే  ప్రత్యర్థి అభిప్రాయాన్ని కూడా వినగల ప్రజాస్వామ్య సంస్కృతి ముఖ్యమైనది.   మనం  నమ్ముతున్న సమాచారాన్ని కూడా ప్రశ్నించుకోవడం.  మనకు నచ్చినదే నిజమని భావించకుండా,  నిజమేమిటో తెలుసుకునే  మేధో  నిజాయితీని పెంచుకోవడం. ఇది జెన్​–జీకి అత్యవసరమైన గాంధేయ విలువ.

స్వదేశీ అంటే స్వయంసమృద్ధి

గాంధీకి ‘స్వదేశీ’ అంటే ప్రపంచం నుంచి మనల్ని మనం వేరుచేసుకోవడం కాదు. మన కాళ్లపై మనం నిలబడటం. నేటి ప్రపంచీకరణలో ఇది మరింత విస్తృతమైన అర్థాన్ని సంతరించుకోవాలి.  స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం,  గ్రామీణ నైపుణ్యాలను కాపాడటం,  ఇవన్నీ స్వయంసమృద్ధి దిశలో అడుగులు.  ప్రపంచంతో పోటీపడాలి. అదే సమయంలో మన స్థానిక ఆర్థికవ్యవస్థను బలహీనపరచకూడదు.  భిన్నత్వం  ప్రజాస్వామ్యానికి బలం.   ఒకరి  విశ్వాసాన్ని మరొకరు గౌరవించడం, ఒకరి హక్కును మరొకరు కాపాడటం, మెజారిటీ–మైనారిటీ అనే గణితాన్ని దాటి ప్రతి మనిషిని సమాన గౌరవంతో చూడటం..ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి.  అందుకే  జెన్–జీకి గాంధీ ఒక దిక్సూచి. ఆ దిక్సూచి మనకు ఎప్పుడూ  సౌకర్యవంతమైన దిశనే చూపకపోవచ్చు. కానీ  సరైన దిశను గుర్తించడానికి అవసరమైన నైతిక ధైర్యాన్ని మాత్రం అందిస్తుంది. సత్యం కష్టమైనా సత్యాన్నే ఎంచుకోవడం, అన్యాయం ఎదురైనా అహింసను  విడిచిపెట్టకపోవడం.. ఇవే గాంధీ చూపిన దారిలోని అసలు మైలురాళ్లు.  మన వ్యక్తిగత జీవితంలోనూ ఆ విలువలకు స్థానం కల్పించిన రోజే గాంధీ చూపిన దారి నిజమైన దిక్సూచిగా  మారుతుంది. ‘దేశం మారాలి’ అని చెప్పడం సులభం. ‘ఆ మార్పులో నా పాత్ర ఏమిటి?’ అని అడగడం కష్టం. ‘వ్యవస్థ తప్పు’ అని చెప్పడం సులభం. ‘నేను ఆ వ్యవస్థలో భాగమై ఏం చేస్తున్నాను?’ అని ఆలోచించడం  కష్టం. గాంధీ చూపినదారి ఈ రెండో ప్రశ్న వైపే నడిపిస్తుంది. అందుకే జెన్–జీకి గాంధీ ఒక విగ్రహం కాదు ఒక దిక్సూచి.
 
అహింస అంటే బలహీనత కాదు

అహింసను కూడా మనం తరచూ తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అహింస అంటే బలహీనత కాదు.  అన్యాయాన్ని  సహించడం అసలే కాదు.  అన్యాయాన్ని ఎదుర్కొంటూనే  ద్వేషానికి లొంగకపోవడమే అహింసలోని అసలు బలం.  మాటలతో చేసే  హింస కూడా హింసే.  సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం,  దూషణలు,  ద్వేషపూరిత వ్యాఖ్యలు,  సమూహాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే ప్రచారం.. ఇవన్నీ ఆధునిక హింసకు రూపాలు. చేతిలోని మొబైల్‌‌‌‌‌‌‌‌ ద్వారా మనిషి మరొకరిని గాయపరచగలుగుతున్నాడు.  ఈ నేపథ్యంలో గాంధీ అహింసకు కొత్త సమకాలీన అర్థాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది.   ప్రజాస్వామ్యంలో నిరసనకు స్థానం ఉంది. అయితే నిరసన హింసగా మారినప్పుడు దాని నైతిక బలం దెబ్బతింటుంది. జెన్​–జీకి  గాంధీ చూపిన మార్గం ఇదే.  ప్రధానంగా ఈ భావన నేటి తరానికి ప్రత్యేకంగా అవసరం.  

- తిప్పర్తి శ్రీనివాస్