వికారాబాద్, వెలుగు: దళితులను బీజేపీ నిత్యం అవమానాలకు గురిచేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ విమర్శించారు. హల్ద్వానీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సభా ప్రాంగణాన్ని శుద్ధీకరణ పేరుతో అవమానించడాన్ని నిరసిస్తూ, ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం వికారాబాద్‌లో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ, సత్యాగ్రహం నిర్వహించాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల సభా ప్రాంగణాన్ని శుద్ధి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రాముడి పేరు చెప్పుకుంటూ బీజేపీ దేశాన్ని దోచుకుంటోందని, దళితులను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు, వివక్ష నిర్మూలనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని అంబేద్కర్విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశారు.
