రూ.7,877 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న విప్రో గ్లోబల్,
జ్యోతి సీఎన్‌సీ, సిర్మా ఎస్‌జీఎస్ వంటి కంపెనీలు
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల (కాంపోనెంట్స్) తయారీ వేగంగా విస్తరిస్తోంది. సెన్సర్లు, సర్క్యూట్ బోర్డులు, టెలికం ఎక్విప్‌మెంట్లు వంటివి లోకల్‌గా తయారు చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్) 2.0 కింద దాదాపు రూ. 7,877 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన 31 కొత్త దరఖాస్తులకు కేంద్రం సోమవారం ఆమోదం తెలిపింది.
‘‘ఈ తాజా ప్రాజెక్టులు 10 రాష్ట్రాలలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా దాదాపు రూ. 82,243 కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుందని అంచనా. సుమారు 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి”అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ (మైటీ) కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు.
భారీగా పెట్టుబడులు
తాజాగా ఆమోదం పొందిన వాటితో కలిపి ఈసీఎంఎస్ పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం 15 రాష్ట్రాల్లో 30కి పైగా విభాగాలలో 106 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 69,548 కోట్ల మొత్తం పెట్టుబడులు ఖరారయ్యాయి. ఇది పథకం ప్రారంభంలో నిర్దేశించుకున్న రూ. 59,350 కోట్ల అసలు పెట్టుబడి లక్ష్యం కంటే ఎక్కువ కావడం గమనార్హం.
ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే మొత్తం ఉత్పత్తి విలువ దాదాపు రూ. 5,34,101 కోట్లకు చేరనుందని అంచనా. మొదట్లో పెట్టుకున్న లక్ష్యం రూ. 4,56,500 కోట్లను దాటేసింది. కాగా, మొత్తం ఈసీఎంఎస్ స్కీమ్ కింద అర్హత పొందిన కంపెనీలకు ప్రభుత్వం రూ.40 వేల కోట్ల వరకు రాయితీలు ప్రకటించింది. గతంలో రూ.22 వేల కోట్లుగా ఉన్న బడ్జెట్‌ను, డిమాండ్ దృష్ట్యా పెంచింది.
ఈ కంపెనీలకు అనుమతులు
కాపర్-క్లాడ్ లామినేట్స్ (సీసీఎల్) తయారీకి సంబంధించి గతంలో ఉన్న ప్రాజెక్టుకు అదనంగా రూ. 1,033 కోట్ల మేర పెట్టుబడి పెంచేందుకు విప్రో గ్లోబల్ తాజాగా ఆమోదం పొందింది. జ్యోతి సీఎన్‌సీ ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన క్యాపిటల్ గూడ్స్ ప్రాజెక్ట్ కోసం రూ. 1,021 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అరుదైన రేర్-ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీ ప్రాజెక్ట్ కోసం క్వాంటమ్ మాగ్నెటిక్స్ రూ. 400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బ్యాటరీ, ఎలక్ట్రానిక్స్ తయారీలో వాడే 'ఎసిటిలీన్ బ్లాక్' ప్లాంట్ కోసం పీసీబీఎల్ కెమికల్ రూ. 329 కోట్లు, పాసివ్ కాంపోనెంట్స్, సబ్-అసెంబ్లీ యూనిట్ల కోసం సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ అనుమతులు పొందాయి.
