హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ రిఫ్రిజరేటర్లు తయారు చేసే హైదరాబాద్ కంపెనీ ఐస్ మేక్ రిఫ్రిజరేషన్ సంస్థలో జపాన్‌కు చెందిన గెలీలి హోల్డింగ్స్ రూ.180 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కంపెనీ సామర్థ్యం విస్తరణ, ఆధునీకరణ పనుల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. రెండు కంపెనీలు కలిసి 60:40 నిష్పత్తిలో కొత్త సంస్థను ఏర్పాటు చేయనున్నాయి.
ఈ జాయింట్ వెంచర్లో గెలీలికి 60 శాతం, ఐస్ మేక్కు 40 శాతం వాటా ఉంటుంది. కొత్త సంస్థ కమర్షియల్ రిఫ్రిజరేషన్ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, పంపిణీపై దృష్టి పెడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఐస్‌మేక్ ఆదాయం 60.4 శాతం పెరిగి రూ.178.88 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.111.50 కోట్లుగా ఉంది. నికర నష్టం రూ.1.65 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.1.47 కోట్లు ఉందని ఐస్ మేక్ సీఎండీ చంద్రకాంత్ పటేల్ తెలిపారు.
