- మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
- బకాయిలు చెల్లించాలని డిమాండ్
మల్కాజ్గిరి, వెలుగు: మల్కాజ్గిరి నియోజకవర్గంలో నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న బీఎల్‌వోలు, ఆశవర్కర్లు, వారికి మద్దతుగా స్థానిక బీజేపీ నాయకులు జోనల్కమిషనర్ఆఫీస్ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఓటరు జాబితా సవరణ, జనగణన సర్వేలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బందికి వేతనాలు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేలో పాల్గొన్న 35 మంది ఆశవర్కర్లతోపాటు, జనగణన విధుల్లో పనిచేసిన 600 మందికి తలా రూ.9,900 బకాయి ఉందన్నారు.
అలాగే, నాలుగేళ్లుగా గౌరవ వేతనం కోసం ఎదురుచూస్తున్న 600 మంది బీఎల్‌వోలకు తలా రూ. 10,000 రావాల్సి ఉందని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లల చదువులు కొనసాగించలేక అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. 2 రోజుల్లో గౌరవ వేతనంలో కొంత మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన జోనల్ కమిషనర్.. చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, శ్రవణ్, సునీత యాదవ్, శ్రీనివాస్, బాలచందర్ గౌడ్, నాగరాజు, ప్రభు గుప్తా, సాయిబాబా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
