ఇంజినీరింగ్ కాలేజీలు రూల్స్ పాటించాల్సిందే

ఇంజినీరింగ్ కాలేజీలు రూల్స్ పాటించాల్సిందే
  • కేటగిరీ- బీ, మేనేజ్‌‌మెంట్, ఎన్‌‌ఆర్‌‌ఐ కోటా ..
  • సీట్ల భర్తీలో ప్రభుత్వ గైడ్​లైన్స్​అమలు చేయాలి  
  • హెచ్​ఆర్​సీ చైర్మన్​ జస్టిస్​ షమీమ్​ అక్తర్​
  • సెయింట్‌‌ మార్టిన్స్‌‌, శంషాబాద్‌‌ వర్ధమాన్‌‌ కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందన 

అబిడ్స్, వెలుగు: ఇంజినీరింగ్‌‌ కోర్సుల్లో కేటగిరీ- బీ, మేనేజ్‌‌మెంట్‌‌, ఎన్‌‌ఆర్‌‌ఐ కోటా సీట్ల భర్తీలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌ ఛైర్మన్‌‌ జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌ సూచించారు.  

ధూలపల్లి సెయింట్‌‌ మార్టిన్స్‌‌, శంషాబాద్‌‌ వర్ధమాన్‌‌ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్​రూల్స్​పాటించడం లేదని  పాలడుగు శ్రీనివాస్‌‌ హెచ్​ఆర్​సీని ఆశ్రయించారు  మెరిట్‌‌, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రవేశాలు చేపడుతున్నారని, ఫీజుల వసూళ్లలోనూ రూల్స్​బ్రేక్​చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ప్రవేశాలకు ముందు అధికారిక నోటిఫికేషన్‌‌ జారీ చేసి..అందులో కోర్సులు, సీట్లు, అర్హతలు, ఫీజు తదితర వివరాలను స్పష్టంగా వెల్లడించాల్సి ఉన్నా పై రెండు కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. 

అర్హత కలిగిన అభ్యర్థులను నిర్దేశిత విధానంలో మెరిట్‌‌ ఆధారంగా ఎంపిక చేయడం లేదని, ప్రవేశ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం లేదన్నారు. అదనపు డొనేషన్‌‌, క్యాపిటేషన్‌‌ ఫీజు పేరుతో విద్యార్థుల నుంచి నగదు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

 కేటగిరీ బీ కింద చేరిన విద్యార్థుల వివరాలను ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌లో నమోదు చేయడంతోపాటు, అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించి రాటిఫికేషన్‌‌ పొందాలని నిబంధన ఉన్నా పాటించడం లేదన్నారు. 

అడ్మిషన్‌‌ షెడ్యూల్‌‌ను కూడా పాటించడం లేదన్నారు. దీనిపై స్పందించిన కమిషన్‌‌..ప్రవేశ నిబంధనల అమలులో తేడాలుంటే విద్యార్థుల విద్యావకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని, ప్రవేశాల విషయంలో ఏకపక్ష, అనధికారిక విధానాలకు తావివ్వకుండా రూల్స్​ప్రకారమే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించింది. 

మానవ హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌‌ 18 ప్రకారం తెలంగాణ ఉన్నత విద్యా మండలికి కమిషన్‌‌ పలు సిఫార్సులు చేసింది. కేటగిరీ- బీ సీట్ల భర్తీలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.