వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై అమెరికా దిగ్బంధనానికి అడ్డు తగిలితే ఒమన్ దేశంపై బాంబు దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ తెల్ల జెండా ఎగురవేసి లొంగిపోవాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
ఇరాన్ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయంలో తనకు ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. ఇరాన్ అణు ఆయుధాలను పొందకుండా చూడటమే తమ మొదటి లక్ష్యమని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా కూడా స్పష్టం చేశారు.
ఇరాన్ ఎప్పటికీ, ఏ రూపంలోనూ అణు ఆయుధాలను కలిగి ఉండకూడదన్నారు. కాగా, హార్మూజ్ జలసంధి ప్రయాణ మార్గాల మ్యాప్‌లపై ఒమన్‌తో ఒప్పందం కుదిరిందని, సంయుక్త ప్రకటనకు సంబంధించిన తుది విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ తెలిపారు.
హార్మూజ్ లోపలికి వెళ్లే నౌకలు ఇరాన్ తీరానికి సమీప మార్గం గుండా, బయటకు వెళ్లే నౌకలు ఒమన్ తీరానికి సమీప మార్గం గుండా వెళ్లేలా అనుమతించేందుకు ఒక అవగాహనకు వచ్చామన్నారు. దీంతో ఈ ఒప్పందం తాత్కాలికంగా కొంతకాలంపాటు ఎలాంటి సుంకాలు లేకుండా నౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అయితే, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం విధించుకున్న 60 రోజుల గడువు ముగిసిపోయింది.
