హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కారణమైన రాజకీయ పార్టీలను బొందపెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసినా ఖైరతాబాద్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఖైరతాబాద్‌లో సుమారు 32 వేల ముస్లిం ఓట్లు ఉన్నాయని, వాటిని ఆధారంగా చేసుకుని తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. అయితే నియోజకవర్గంలోని సుమారు 2 లక్షల హిందూ ఓట్లను ఓటుబ్యాంకుగా మలిచే సామర్థ్యం బీజేపీకి ఉందన్నారు.
ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్‌కు రాజకీయంగా స్థానం లేకుండా పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే వారి పరిస్థితి ‘‘పెనం నుంచి పొయ్యిలో పడినట్లే’’ అవుతుందని విమర్శించారు.కాంగ్రెస్ దేశాన్ని మూడు ముక్కలు చేసిందని ఆరోపిస్తూ, తెలంగాణలో ముఖ్యమంత్రి దేవుళ్ల పేరుతో హిందూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలే నిరసిస్తున్నారని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకున్నా ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారని విమర్శించారు.అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి వంటి సందర్భాల్లో కేసీఆర్ ప్రజల్లోకి రారని, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తారని ఆయన ఆరోపించారు. శాసనమండలి ఎన్నికల సమయంలో పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా మాత్రమే కేసీఆర్ బయటకు వస్తారని విమర్శించారు.ఇలాంటి రాజకీయ నాయకుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేలా బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.
