గడచిన 6 నెలలకు పైన నుంచి దేశంలో కోడిగుడ్లు, చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాస్తంత ప్రొటీన్ ఫుడ్ తిందాం అంటే జేబులకు చిల్లుపడుతోంది. పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చులో పోషకాలకు కేంద్రంగా ఉన్న ఈ ఆహారాలు ఖరీదుగా మారటం.. రానున్న మరికొన్ని నెలల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒకపక్క ఎల్ నినో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంటే మరోపక్క మోడీ సర్కార్ నిర్ణయం కూడా దీనికి తోడై రోజువారీ ఆహార ఖర్చులను పెంచుతున్నట్లు తేలింది.
మోడీ సర్కార్ చేపట్టిన పెట్రోల్ ఇథనాల్ బ్లెండింగ్ కి 'ఎల్ నినో' ప్రభావం కలవటంతో సామాన్యులపై ఆర్థిక భారం పెరిగింది. E20 పెట్రోల్ కోసం మొక్కజొన్నల వాడకం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు పౌల్ట్రీ ఫీడ్ కోసమే ఎక్కువగా వినియోగించిన మొక్కజొన్నలను ఇప్పుడు డిస్టిలరీలు ఇథనాల్ తయారీకి తీసుకెళ్లోపోవటంతో.. కోడి మాంసం, గుడ్ల ధరలు అకాశాన్నంటుతున్నాయి.
పెరిగిన మొక్కజొన్నల ధరలు..
2019లో కిలో రూ.12 నుంచి రూ.14 ఉన్న మొక్కజొన్నల ధర.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏకంగా రూ.27 నుంచి రూ.28కి కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.32 వరకు చేరుకుంది. పౌల్ట్రీ రంగానికి మొక్కజొన్నలే ప్రాథమిక ఆహారం. ఇథనాల్ తయారీలో మొక్కజొన్నల వాడకం 2021-22లో సున్నా శాతంగా ఉండగా.. 2025-26 నాటికి అది ఏకంగా 37 శాతానికి పెరిగింది. దీనివల్ల పౌల్ట్రీ రైతులకు దాణా కొనుగోలు భారమై.. గుడ్డు ఉత్పత్తి ఖర్చు రూ.2.50 నుంచి రూ.4.50కి పెరిగింది. ఈ భారాన్ని భరించలేక రైతులు తీవ్ర నష్టపోతుంటే.. మరోపక్క కస్టమర్ల జేబులకు భారీగా చిల్లుపడుతోంది పెరిగిన వీటి ధరలతో.
తోడైన ఎల్ నినో..
ఈ సంక్షోభానికి తోడు ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా కురవక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాభావం కారణంగా మొక్కజొన్న, సోయాబీన్ సాగు తగ్గిపోయింది. సాధారణ దిగుబడిలో కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో మొక్కజొన్నల కొరత మరింత తీవ్రమైతే కిలో ధర రూ. 30 దాటే ప్రమాదముంది. ఇదే జరిగితే ప్రస్తుతం రూ.10 ఉన్న కోడిగుడ్డు ధర రూ.20 నుంచి రూ. 25కి, కిలో చికెన్ ధర రూ.400 నుంచి రూ.500కి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగ్గుతున్న ఇతర పంటల సాగు..
మొక్కజొన్నలకు డిమాండ్ పెరగడంతో రైతులు పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును తగ్గించి మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది దేశం ఎదుర్కొంటున్న ఆహార భద్రతా సవాళ్లను మరింత పెంచుతోంది. ఇప్పటికే భారత్ వంటనూనెల దిగుమతి కోసం ఏటా రూ.2లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ఇథనాల్ కోసం మొక్కజొన్నలను మళ్లించడం వల్ల ఏర్పడిన లోటును పూడ్చడానికి ఇప్పుడు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్ దిగుమతుల బిల్లు తగ్గినా.. నూనెగింజల దిగుమతి బిల్లు విపరీతంగా పెరుగుతుండటంతో అసలు ప్రయోజనం సున్నాగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
సామాన్యులపైనే అసలు భారమంతా..
ప్రభుత్వ అసంబద్ధ ప్రణాళికలు, డిస్టిలరీల లాభాపేక్ష కారణంగా చివరికి ఈ భారం అంతా సామాన్యుల జేబులపైనే పడుతోంది. ప్రొటీన్ కోసం అవసరమైన గుడ్లు, చికెన్ ధరలు సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తున్నాయి. ఇప్పటికైనా ఈ డామినో ఎఫెక్ట్ అర్థం చేసుకుని మోడీ సర్కార్ మెుద్దునిద్ర వీడాలని ప్రజలు కోరుతున్నారు. ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలని లేదంటే పేదల పోషకాహార స్థాయి దెబ్బతింటుందని రైతులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
