మూసీని కాంక్రీట్ నిర్మాణాలతో నింపొద్దు.. మూసీ నదిలో నిర్మాణాలపై పర్యావరణ సంస్థల అభ్యంతరం

మూసీని కాంక్రీట్ నిర్మాణాలతో నింపొద్దు.. మూసీ నదిలో నిర్మాణాలపై పర్యావరణ సంస్థల అభ్యంతరం

పంజాగుట్ట, వెలుగు: మూసీ నదిని అభివృద్ధి పేరుతో కాంక్రీట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాలతో నింపకుండా, దాని సహజ స్వరూపాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని పలు పర్యావరణ, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మూసీ ప్రాజెక్టుపై పర్యావరణ ప్రభావ నివేదికను సమగ్రంగా పునఃసమీక్షించాలని కోరారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో మూసీ జన ఆందోళన, మానవ హక్కుల వేదిక, ప్రపంచ వాణిజ్య సంస్థ సంయుక్త కార్యాచరణ సమితి, జాతీయ ప్రజా ఉద్యమ వేదిక, చాత్రి, ప్రగతిశీల మహిళా సంఘం, వాతావరణ ఉద్యమం తెలంగాణ, పర్యావరణ న్యాయ వేదికల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశానికి  ప్రొఫెసర్ హరగోపాల్, డి. నరసింహా రెడ్డి, రమా మేల్కోటే, శాంతా సిన్హా,  విశ్రాంత శాస్త్రవేత్త జీవన్ కుమార్,  సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ,  కే శ్రీనివాస్,  పాశం యాదగిరి, సజయా , పీవోడబ్ల్యూ సంద్య,  బాబురావు తదితరులు హాజరై, మాట్లాడారు. మూసీ నదీ పునరుద్ధరణ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో పలు అంశాలపై స్పష్టత లేదని వక్తలు ఆరోపించారు. నది సహజ ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో తీవ్రమైన వరద ముప్పు తప్పదన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, వరద మైదానాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండా పనులు చేపట్టడం సరికాదన్నారు.