ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 24 మందికి గాయాలు ..జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రమాదం

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 24 మందికి గాయాలు ..జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రమాదం

మల్యాల/జగిత్యాల టౌన్, వెలుగు : ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలోని బల్వంతపూర్ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. కరీంనగర్ డిపో-1 కు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో జగిత్యాల మీదుగా నిజామాబాద్ వైపు వెళ్తోంది. 

బల్వంతపూర్ స్టేజీ సమీపంలోని రాగానే ఆర్టీసీ బస్సును జగిత్యాల నుంచి ఏపీ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న 22 మంది గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని 108లో జగిత్యాల హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుకావడంతో డ్రైవర్ అక్కడే ఇరుక్కుపోయాడు. క్రేన్, జేసీబీ సాయంతో ముందు భాగాన్ని తొలగించి డ్రైవర్ ను బయటకు తీశారు. ప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రులు పొన్నం, అడ్లూరి ఆదేశించారు.