న్యూఢిల్లీ: నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని తాను ఎప్పుడూ అంగీకరించలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు వర్సిటీ యాజమాన్యం సీజేఐని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించగా, వర్సిటీ స్టూడెంట్లు కొందరు వ్యతిరేకించిన నేపథ్యంలో సీజేఐ ఈమేరకు స్పందించారు.
సోమవారం జోధ్‌పూర్‌లో జాతీయ లా యూనివర్సిటీల వైస్ చాన్సలర్లను ఉద్దేశించి ప్రసంగించిన కొన్ని గంటల తర్వాత సీజేఐ మీడియాతో మాట్లాడారు. తాను ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదని, కాబట్టి అక్కడి వెళ్లడం అన్న ప్రశ్నే ఉత్పన్నంకాదని చెప్పారు. కాగా, సాంప్రదాయం ప్రకారం నల్సార్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీజేఐ సూర్య కాంత్‌ను ఆహ్వానించినట్లు నాలుగు రోజుల క్రితం యూనివర్సిటీ ధృవీకరించింది.
ఈ కార్యక్రమం ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. నల్సార్‌లోని దాదాపు 1,400 మంది విద్యార్థులలో 400 మందికి పైగా విద్యార్థులు సీజేఐ రాకను వ్యతిరేకించారు. ఈ వివాదం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం వరకు వెళ్లడంతో చర్చనీయాంశమైంది.
జులై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల అణచివేత, పెల్లెట్ గన్ల వాడకం వంటి అంశాలపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. న్యాయస్థానంలో సరైన పిటిషన్ దాఖలు చేయకుండా కేవలం వీడియో ఫుటేజ్ ఉందంటూ జులై 22న ఓ అడ్వకేట్ కోరిన అభ్యర్థనను సీజేఐ నేతృత్వంలోని బెంచ్ సుమోటోగా స్వీకరించడానికి నిరాకరించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సరైన పిటిషన్ దాఖలు చేయాలని, న్యాయస్థానపు సమయాన్ని వృథా చేయవద్దని సీజేఐ ఆ సమయంలో సూచించారు. ఆ తర్వాత ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లను స్వీకరించిన సీజేఐ బెంచ్, విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
