గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

చండ్రుగొండ/ అన్నపురెడ్డిపల్లి/ ములకలపల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో ఆయన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. చండ్రుగొండ మండలంలోని ఆయా గ్రామాల్లో రూ.2.23 కోట్లు, అన్నపురెడ్డిపల్లి మండలంలో రూ.40 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. 

కాగా, విద్యాయాత్రలో భాగంగా ఎమ్మెల్యే అప్పుగూడెం ఎంపీపీఎస్​స్కూల్​ని ఆకస్మిక తనిఖీ చేశారు. ములకలపల్లి మండలంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. టేకులగుంపు గ్రామంలో పేద గిరిజన విద్యార్థి నక్క సంతోష్​ ఎంబీబీఎస్​చదువుకు తమవంతు సాయం అందిస్తామని వారు భరోసా ఇచ్చారు. 

బ్రిడ్జి ప్రారంభం.. 

అశ్వారావుపేట: మండల పరిధిలోని కేసప్పగూడెం, అల్లాడివారిగూడెం మధ్య రూ.3.50 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ప్రారంభించారు. గాండ్లగూడెం, చెన్నాపురం గ్రామాల మధ్య 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.