ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ రంగ అభివృద్ధికి రూ. 205 కోట్లతో పనులు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ తో కలిసి గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్‌లో డివిజన్ ఈఆర్‌వో ఆఫీస్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, హైటెన్షన్ విద్యుత్ వైర్ల మార్పిడి, కొత్త విద్యుత్ లైన్లు, కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా స్పీడ్ గా పూర్తి చేస్తున్నామన్నారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకులు విద్యుత్ రంగంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలో పూర్తి కాలేదని, కాంగ్రెస్ వచ్చాకే వాటిని పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిందని చెప్పారు.
తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్అండ్‌బీ ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ నవీన్ పాల్గొన్నారు.
