బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా..బాధ్యతల నుంచి తప్పించాలంటూ రెండోసారి లేఖ

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా..బాధ్యతల నుంచి తప్పించాలంటూ రెండోసారి లేఖ

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌‌‌‌కు మరో లేఖ రాశారు. ఈ లేఖను ‘ఎక్స్‌‌‌‌’లో పంచుకున్నారు. తనకు ప్రస్తుతం అత్యవసర వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని, అందుకే ప్రైవేట్ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పూనావాలా తెలిపారు. తన రాజీనామాను పునఃపరిశీలించాలని పార్టీ కోరినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అయితే, చాలా కాలం ఆలోచించిన తర్వాత పార్టీ పదవి, క్రియాశీల సభ్యత్వం నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

తాను పార్టీ వ్యవస్థ నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని, వ్యక్తులపై గానీ, పార్టీ సిద్ధాంతంపై గానీ తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పార్టీ సీనియర్ నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనలాంటి పాస్మందా ముస్లింకు, ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా బీజేపీలో మంచి అవకాశం లభించిందని పూనావాలా చెప్పారు. ఇలాంటి వేదిక మరెక్కడా దొరకదన్నారు. కాంగ్రెస్‌‌‌‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పూనావాలా.. 2021 చివర్లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు సంస్థాగత బాధ్యతల నుంచి తనను అధికారికంగా తప్పించాలని మరోసారి పార్టీ అధ్యక్షుడిని కోరారు.