అత్తాపూర్ లో వైద్యుల నిర్లక్ష్యం.. జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన

అత్తాపూర్ లో  వైద్యుల నిర్లక్ష్యం.. జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన

హైదరాబాద్‌లోని అత్తాపూర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జ్వరం తగ్గి ఆరోగ్యంగా ఇంటికి వస్తుందనుకున్న యువతి.. విగతజీవిగా మారడంతో 'జాయ్ హాస్పిటల్' ఎదుట విషాదంతో పాటు బంధువుల ఆందోళనకు దిగారు.  

వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసముండే 28 ఏళ్ల శ్రీలతకు సోమవారం జ్వరం రావడంతో, కుటుంబ సభ్యులు అత్తాపూర్ సమీపంలోని జాయ్ హాస్పిటల్‌లో చేర్పించారు. సోమవారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలత పరిస్థితి.. రాత్రికి రాత్రే విషమించిందని చెప్పి వైద్యులు హుటాహుటిన ఐసీయూకి  తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు.

అప్పటివరకు బాగానే ఉన్న తమ బిడ్డ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీలత చనిపోయిందంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట భారీ ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అసలు శ్రీలత మృతికి కారణం ఏంటి? బంధువులు ఆరోపిస్తున్నట్లు ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఉందా? లేక అనారోగ్యం విషమించడమే మరణానికి కారణమా? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.