అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ గోవా మద్యం స్మగ్లింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 400 ఫుల్ బాటిళ్ల గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ఓ లారీపై అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీల్లో లారీ క్యాబిన్‌లోపల ఎవరికీ కనిపించకుండా ఒక ప్రత్యేకమైన రహస్య బాక్స్‌ను ఏర్పాటు చేసినట్లు బయటపడింది. ఆ సీక్రెట్ బాక్స్‌లో భద్రపరిచిన సుమారు 400 మెన్షన్ హౌస్ గోవా మద్యం ఫుల్ బాటిళ్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్మగ్లింగ్ వ్య వహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కళ్లుగప్పేందుకు ఆ లారీకి ఏకంగా రెండు వేర్వేరు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను వాడుతున్నారు. ఒక నంబర్ ప్లేట్ కర్ణాటక రాష్ట్రానికి చెందింది కాగా, మరొక నంబర్ ప్లేట్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినదిగా గుర్తించారు.
ఈ భారీ మద్యం అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ స్మగ్లింగ్‌కు సూత్రధారులు ఎవరు? ఈ రాకెట్ ఎక్కడెక్కడ వేర్లు వేసింది? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.లారీతో పాటు భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
