అమెరికాలోని బాల్టిమోర్‌లో దారుణ ఘటన జరిగింది. పార్కింగ్ స్థలం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న 12 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. పిల్లలు అమెరికన్ ఫుట్‌బాల్ ఆడుతున్న పార్కులో ఈ ఘటన జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. పార్కింగ్ స్థలం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అదే సమయంలో సమీపంలో ఫుట్‌బాల్ చూస్తున్న 12 ఏళ్ల బాలిక కు బుల్లెట్ తగిలింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.బాలికతో పాటు మరో మహిళ కూడా తుపాకీ గాయాలయ్యాయి.
ఈ ఘటనలో మృతి చెందిన బాలిక కాల్పులకు లక్ష్యం కాదని బాల్టిమోర్ పోలీస్ కమిషనర్ రిచర్డ్ వోర్లీ తెలిపారు. ఈ కేసులో కనీసం ఇద్దరు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కాల్పులు ఎన్ని రౌండ్లు జరిగాయనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని వోర్లీ చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు దశలో ఉంది.
