బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కాకా : తిరుపతిలో గడ్డం వెంకటస్వామి సేవా కార్యక్రమాలు

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కాకా : తిరుపతిలో గడ్డం వెంకటస్వామి సేవా కార్యక్రమాలు

మాజీ కేంద్ర మంత్రి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన గడ్డం వెంకటస్వామి జయంతిని పురస్కరించుకుని 2026, అక్టోబర్ 5వ తేదీన తిరుపతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు దళిత సంఘాల నేతలు. పట్టణంలోని రుయా ఆసుపత్రి సమీపంలో సీనియర్ దళిత నాయకుడు మల్లారపు మధు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పేదలు, నిరాశ్రయులకు అన్న ప్రసాదాలు అందించి వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పించారు నేతలు, కార్యకర్తలు, అభిమానులు. 

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గడ్డం వెంకటస్వామి చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తి అని కొనియాడారు దళిత సీనియర్ నేత మల్లారపు మధు. ఆయన ఆశయాలు, లక్ష్యాలు, స్ఫూర్తిని.. రేపటి తరానికి అందించటమే ఆయనకు నిజమైన నివాళిగా కొనియాడారు. పేదలకు ఆయన చేసిన కృషికి.. పేదలను ఆయన ఆదుతున్న తీరును చూసి గడ్డం వెంకటస్వామిని.. అందరూ కాకా అని ఆప్యాయంగా.. ముద్దుగా పిలుచుకునే వారంటూ.. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మల్లారపు మధు. సమాజంలో అవసరమైన వారికి చేయూతనిచ్చే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని ఆకాంక్షించారు.

గడ్డం వెంకటస్వామి కాకా జయంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు లోకయ్యతో పాటు బాలాజీ, పీసీ స్వామి, అశోక్, రాజా, దేవేంద్రబాబు, శివ, నాగేంద్ర, చంగల్ నాయుడు, సౌందర్య నాయక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. గడ్డం వెంకటస్వామి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పేదలు, నిరాశ్రయులకు అండగా నిలుస్తూ.. కాకా ఆశయాలను భవిష్యత్ తరానికి అందించే లక్ష్యంతో.. రేపటి తరానికి ఆయన సేవలను గుర్తు చేస్తూ.. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని నిర్వహకులు ప్రతిజ్ణ చేశారు. గడ్డం వెంకటస్వామి జయంతిని కేవలం స్మరణకే పరిమితం చేయకుండా.. అన్నదానం, వస్త్రదానం ద్వారా సేవా కార్యక్రమంగా నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది.