ఈ కేసులో ట్రస్టు మాజీ సభ్యులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్ ఇచ్చింది. విరాళాల డొనేషన్ల దోపిడీ కేసులో అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన ఈ ఇద్దరు సభ్యులకు క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. జూన్ 27న రిజైన్ చేసిన వీరిద్దరిని సిట్ పలుమార్లు ప్రశ్నించిన తర్వాత.. ఈ కేసుకు వీరి పాత్ర లేనట్లు సిట్ తేల్చింది.
విచారణ సందర్భంగా విరాళాల చోరీ కేసుతో తనకు సంబంధం లేదని.. ఈ కేసులో మొదట ఫిర్యాదు చేసిందే తను అని చెప్పినట్లు తెలుస్తోంది. విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని చెప్పట్లు సమాచారం.
విరాళాల చోరీ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లక్నో డివిజనల్ కమిషన్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో జూన్ 13న సిట్ ఏర్పటు చేసిన విషయం తెలిసిందే. జూన్ 23 నే ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్ పలు కీలక రెకమెండేషన్స్ చేసింది.
ప్రాథమిక నివేదిక ఆధారంగా, ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ శ్రీరామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీనిని అనుసరించి జూన్ 25న ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. ఈ ఎఫ్‌ఐర్‌లో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ , రామ్ శంకర్ యాదవ్ (అలియాస్ తిన్ను)లతో పాటు ఇతర గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు.
ఈ ఎఫ్‌ఐఆర్ (FIR)లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రా పేర్లు లేవు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act)లోని సెక్షన్ 13(1)(a) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి ఎఫ్‌ఐఆర్ నమోదు, అరెస్టుకు సంబంధించిన చర్యలకు ఎస్‌ఐటీ (SIT) సమర్పించిన ప్రాథమిక నివేదిక కూడా ఆధారంగా నిలిచింది.
వివాదం ఏంటంటే..?
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, ట్రస్ట్ నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మరోవైపు.. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి.. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణకు ఆదేశించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది.
ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది.
ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. ఆరు రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలించింది. ఆరు రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఎంకు అందజేసింది సిట్. నిధుల గోల్ మాల్ వ్యవహారంలో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
