16 ఏళ్లకే 275 కిలోల బరువు... హై రిస్క్ సర్జరీ చేసి 50 కేజీలు తగ్గించిన డాక్టర్లు!

16 ఏళ్లకే 275 కిలోల బరువు... హై రిస్క్ సర్జరీ చేసి 50 కేజీలు తగ్గించిన డాక్టర్లు!

తొమ్మిది లేదా పదో తరగతి చదువుతూ.. తోటి పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడపాల్సిన వయసులో అరుదైన సమస్యతో బాధపడుతున్న బాలుడికి సర్జరీ చేశారు డాక్టర్లు. 16 ఏళ్ల వయసులోనే దాదాపు 275 కిలోల బరువుతో, బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 100కు చేరువగా ఉండటంతో షాకైన డాక్టర్లు.. అత్యంత రిస్కుతో కూడిన సర్జరీ చేశి బరువు తగ్గించారు. తగ్గింది 50 కేజీలే.. మరి మిగతా బరువు గురించి.. బాలుడి భవిష్యత్ పరిస్థితి గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం.

ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో విజయవంతంగా లాపరోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ (బేరియాట్రిక్ సర్జరీ) చేయించుకున్నాడు ఈ బాలుడు.  తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు, నిద్రలో గొంతు కండరాలు సడలిపోయి శ్వాసకు ఇబ్బంది కలిగే సమస్య(అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా), చర్మ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరాడు. బాలుడి బరువు చాలా ఎక్కువగా ఉండటంతో సాధారణ కారులో సరిపోక, మాటడార్ వాహనంలో ఆసుపత్రికి తీసుకురావాల్సి వచ్చింది.   దాదాపు రెండు వారాల పాటు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)లో చికిత్స అందించారు.

ఈ కేసు చాలా సంక్లిష్టంగా, ప్రమాదకరంగా ఉండటంతో పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, బేరియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, అనస్థీషియా తదితర విభాగాల నుంచి సుమారు 20 మంది నిపుణులు సమగ్రంగా పరిశీలించి చికిత్స అందించారు. సర్జరీ రిస్కు గురించి ఫ్యామిలీతో చెప్పి వారు ఒప్పుకున్నాకే  బేరియాట్రిక్ సర్జరీని చేసినట్లు తెలిపారు. 

సర్జరీని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్, మెటబాలిక్ & బేరియాట్రిక్ సర్జరీ విభాగం నుంచి డాక్టర్ దక్ష్ సేథి, డాక్టర్ సుధీర్ కల్హాన్, డాక్టర్ ముకుంద్ ఖేతన్, డాక్టర్ సువిరాజ్ జాన్ లు నిర్వహించారు. అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విజయవంతంగా పూర్తిచేశారు. ఆపరేషన్ తర్వాత కేవలం మూడు రోజులకే బాలుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

సుమారు రెండు నెలల తర్వాత అతని బరువు 275 కిలోల నుంచి 223 కిలోలకు తగ్గింది. అంటే దాదాపు 50 కిలోలు తగ్గాయి. వైద్యులు మాత్రం కేవలం బరువు తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యం, చలనశీలత, జీవన నాణ్యత మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు.

 ఇది సాధారణ బేరియాట్రిక్ ఆపరేషన్ కాదు. రోగి వయస్సు, బరువు, తీవ్రమైన స్లీప్ అప్నియా కారణంగా ప్రతి దశను జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి వచ్చింది  అని  బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ దక్ష్ సేథి అన్నారు.

డాక్టర్ సుధీర్ కల్హాన్ మాట్లాడుతూ, ఇంత చిన్న వయసులో ఇంత తీవ్రమైన ఊబకాయం ఉన్న రోగిలో.. ప్రస్తుతం వెంటనే బరువు తగ్గింపు కంటే దీర్ఘకాలిక ఆరోగ్యం, లైఫ్ క్వాలిటీ మెరుగుపరచడమే మా ప్రాధాన్యత అని చెప్పారు. మొత్తం బరువు తగ్గిస్తే ప్రాణాలకే ప్రమాదమని చెప్పిన డాక్టర్లు.. ప్రస్తుతం 50 కేజీలు తగ్గించినట్లు చెప్పారు. . గత రెండు నెలల్లో బాలుడి రికవరీ ఆశించిస్థాయిలో ఉందని తెలిపారు.  

ప్రస్తుతం ఈ బాలుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. బరువు స్థిరంగా మెయింటైన్ చేయడం,  ఈజీగా కదిలేలా చేయడం, లాగ్ రన్ లో ఆరోగ్యం.. మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని అతడికి ట్రీట్ మెంట్ కొనసాగించనున్నట్లు డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.