గుట్టల్లో ట్రెక్కింగ్.. గుడారాల్లో బస... ప్రత్యేక టూరిజం కేంద్రంగా పాండవుల గుట్ట

గుట్టల్లో ట్రెక్కింగ్.. గుడారాల్లో బస... ప్రత్యేక టూరిజం కేంద్రంగా పాండవుల గుట్ట
  • పర్యాటకులను ఆకర్షించేలా రాక్ క్లైంబింగ్
  •  రాత్రి బస చేసేలా గుడారాల ఏర్పాటు

జయశంకర్ భూపాలపల్లి/రేగొండ, వెలుగు :  భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని పాండవుల గుట్టలను ప్రత్యేక టూరిస్ట్ ప్లేస్ గా మార్చేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. వారాంతాల్లో పర్యాటకులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి సేద తీరేలా, ఇక్కడే రాత్రి బస చేసేలా ఏర్పాట్లు చేశారు. 

ఇందులో భాగంగా డీఎంఎఫ్ టీ, ఏకో టూరిజం నిధులు రూ. 18 లక్షలతో మూడు ఎకరాల అటవీ భూమిలో గుడారాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రెండు మోడ్రన్ కిచెన్, టాయిలెట్లు ఏర్పాటు చేసి, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించారు. 

మొత్తం 200 మంది వరకు ఉండేలా వసతులు కల్పించారు. వీటితో పాటు ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, అడవిలో విహారం వంటివి సైతం ప్రారంభించారు. పాండవుల గుట్టల్లో రాత్రి బస చేయాలనుకునే వారికి ఆన్ లైన్ ద్వారా పేర్ల నమోదుకు అవకాశం కల్పించారు.

 అనంత హైఎక్స్ ఏజెన్సీ ద్వారా ఔత్సాహికులైన విద్యార్థులను గుర్తించి వారితో గుట్టల వద్ద రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్ చేపడుతున్నారు. పాండవుల గుట్టల సమీపంలోని ద్వంస కుంటలో కయాకింగ్ (సింగిల్ బోటింగ్) కు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరో వైపు పాండవుల గుట్టలు, గణపసముద్రం, నాపాక, కోటంచ  క్షేత్రాలను టూరిజం సర్క్యూట్ గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా, పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెల్పూర్ ఎఫ్ఆర్ వో చంద్రమౌళి  తెలిపారు.