- గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి సబ్‌కీ యోజన సబ్‌కా వికాస్ ప్రచారం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో 'జన్ ఆందోళన్'
హైదరాబాద్, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం (అక్టోబర్ 2) రాష్ట్రంలోని 9,593 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జలసమృద్ధి, నేల సంరక్షణ సంస్కరణలను ప్రజలకు చేరవేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెంచి, కమ్యూనిటీ యాజమాన్యం ద్వారా ప్రజా ఉద్యమంగా (జన్ ఆందోళన్) మార్చడమే లక్ష్యంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు.
గ్రామసభల ద్వారా ప్రజలందరి భాగస్వామ్యంతో 'ప్రణాళిక – అందరి అభివృద్ధి' (సబ్‌కీ యోజన సబ్‌కా వికాస్) ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి దశలో రాష్ట్రంలోని 9,593 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన తర్వాత మరింత విస్తరించనున్నారు. జిల్లా, ప్రాజెక్టు స్థాయిల్లో వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
వాటర్ షెడ్ పనుల్లో మెరుగైన ఫలితాలకు చర్యలు
వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం హెక్టారుకు కేటాయించే నిధులను భారీగా పెంచింది. హెక్టారుకు ఇచ్చే నిధులను రూ.12 వేల నుంచి రూ.22 వేలకు పెంచారు. కొండ ప్రాంతాల్లో నిధులను రూ.15 వేల నుంచి రూ.28 వేలకు పెంచారు. గతంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏడేండ్ల సమయం పట్టగా దానిని ఐదేండ్లకు తగ్గించారు.
వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాల కింద ఇప్పటివరకు దేశంలో దాదాపు 3.4 కోట్ల హెక్టార్ల భూమిని కవర్ చేశారు. అనేక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం మూడు మీటర్ల వరకు పెరిగింది. సాగు విస్తీర్ణం 30 శాతం పెరగడంతో కరువు పీడిత ప్రాంతాల రైతులు సైతం ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించే స్థాయికి చేరారు. పాల ఉత్పత్తి 40 శాతం పెరగ్గా, రైతుల వార్షిక ఆదాయం ఏకంగా 70 శాతం వరకు పెరిగింది.
