- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి సంస్థకు చెందిన బి-40 క్వార్టర్‌ను ప్రైవేట్ వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకోవడంతోనే ఖాళీ చేయించామని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. మంత్రి ఒత్తిడితో మద్ది శంకర్‌ను క్వార్టర్ నుంచి ఖాళీ చేయించారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎలాంటి సంబంధం లేదన్నారు. గురువారం జీఎం మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థకు చెందిన బి-40 క్వార్టర్‌లో మద్ది శంకర్ అక్రమంగా ఉంటున్నట్లు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు అందిందన్నారు.
దీనిపై విచారణ జరిపి అక్రమంగా ఉంటున్నట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాత క్వార్టర్ ఖాళీ చేయాలని కోరినా సహకరించలేదన్నారు. 2001లో జారీ చేసిన జీఎం ఎవిక్షన్ ప్రొసీజర్ ప్రకారం సింగరేణి ఆస్తులను ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే ఖాళీ చేయించే అధికారం యాజమాన్యానికి ఉందన్నారు. ఈ ప్రొసీజర్‌లో భాగంగా క్వార్టర్ ఖాళీ చేయాలని మద్ది శంకర్‌కు మూడుసార్లు నోటీసులు, రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా ఖాళీ చేయలేదన్నారు. ఎవిక్షన్ ప్రొసీజర్ ప్రకారం ఫామ్ ఎ, బి కూడా ఇచ్చామని, సామగ్రిని తీసుకుని క్వార్టర్ ఖాళీ చేయాలని కోరినా వినలేదని తెలిపారు. చివరకు ఈ నెల 30న రెండు దఫాలుగా స్థానిక పోలీసులు, సింగరేణి ఎస్‌అండ్‌పీసీ, ఎస్టేట్ అధికారులు, సిబ్బంది సమక్షంలో బి-40 క్వార్టర్‌లో ఉన్న మద్ది శంకర్ సామగ్రిని బయటకు తీసి ఎస్‌అండ్‌పీసీ కార్యాలయంలో భద్రపరిచినట్లు చెప్పారు.
మంత్రి ప్రమేయం లేదు..
మంత్రి వివేక్ వెంకటస్వామికి క్యాంపు కార్యాలయం కోసం బి-1 క్వార్టర్‌ను కేటాయించామని, మరో క్వార్టర్ కేటాయించే నిబంధన ఏదీ లేదని జీఎం తెలిపారు. మంత్రికి గతంలో బి-40 క్వార్టర్ కేటాయించారన్న ప్రచారంలోనూ వాస్తవం లేదని, అధికారికంగా ఎక్కడా లేదని స్పష్టం చేశారు. మంత్రి ఒత్తిడితో మద్ది శంకర్‌ను ఖాళీ చేయించారన్న ప్రచారం అవాస్తవమన్నారు. బి-40 క్వార్టర్‌ను ఇప్పటికే సింగరేణి సూపర్‌వైజర్‌కు కేటాయించినట్లు వెల్లడించారు.
