- సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్రంలో కరెంటు లేక రైతుల పంటలు ఎండుతుంటే.. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు అమ్మేందుకు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల, అక్కనేపల్లి, అంక్షాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు.
నర్మెట సబ్‌స్టేషన్‌ను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఏడు గంటలు కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. లో వోల్టేజ్ కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 22 గంటలు కరెంటు ఇచ్చినా గగ్గోలు పెట్టి విమర్శలు చేసినవారు.. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన దాంట్లో సగం కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఒక్క నంగునూరు మండలంలోనే ఈ వారంలో 41 ట్రాన్స్‌ఫార్మర్లు, 100 నుంచి 200 మోటార్లు కాలిపోయాయని తెలిపారు.
సీఎం రైతుల వద్దకు వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అనంతరం అక్కనేపల్లి గ్రామంలో జరిగిన ఈత వనాల పెంపకం కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్మిక విభాగం నాయకులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
