వెలుగు, నెట్వర్క్ : ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మండల ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా మండలాల్లో ప్రారంభమైంది. ములుగు జిల్లా గోవిందరావుపేటలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క హాజరై ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.
ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి, దరఖాస్తుదారుల ఫోన్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు. ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగుల పింఛన్ దరఖాస్తులను ఈ నెల 31లోగా స్వీకరించాలని ఆదేశించారు. పస్రా, గోవిందరావుపేట, చల్వాయి ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు ఎస్టీ తండాలు, గూడేల్లో మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.50 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
దుమ్ముగూడెంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రజావాణిని ప్రారంభించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పాల్వంచలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజావాణిలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్ తదితరులు పాల్గొనగా, మొత్తం 23 దరఖాస్తులు అందాయి. వర్ధన్నపేట మండలంలో 18, ఐనవోలు మండలంలో 6 దరఖాస్తులు వచ్చాయి.
ధర్మసాగర్, వేలేరు మండలాల్లో 16 అర్జీలు, వెంకటాపూర్‌లో 26, మొగుళ్లపల్లిలో 4, తాడ్వాయిలో 10 దరఖాస్తులు స్వీకరించారు. జూలూరుపాడులో 23 శాఖల అధికారులు హాజరైనా కేవలం 2 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. టేకులపల్లిలో పలు సమస్యలపై దరఖాస్తులు అందాయి. ఆఫీసర్లు సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.
